తాప్సీని అలా చూడగలమా?

మణిపూర్‌ ఉక్కు మహిళ ఇరోం షర్మిల. సుదీర్ఘ కాలం పాటు ఆమె నిరాహార దీక్ష చేశారు. ఏళ్ళ తరబడి ఎలాంటి ఆహారమూ ఆమె తీసుకోలేదు. ఆమె సంకల్పం అలాంటిది. భద్రతాదళాలకు ప్రత్యేక అధికారాల్ని కట్టబెట్టే చట్టాన్ని ఆమె వ్యతిరేకించారు. ఆ చట్టం ద్వారా మణిపూర్‌లో సామాన్యులు ఎదుర్కొంటున్న ఇబ్బందులే ఆమె ఉద్యమబాట పట్టేలా చేశాయి. అయితే సుదీర్ఘకాలం నిరాహార దీక్ష చేసి, ఇటీవలే దీక్ష విరమించిన ఇరోం షర్మిల, రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు. అలాగే తన స్నేహితుడ్ని ఆమె వివాహం కూడా చేసుకోబోతున్నారు. ఉక్కు సంకల్పం అంటే ఏమిటో చెప్పడానికి ఇరోం షర్మిలను ఉదాహరణగా చూపించవచ్చు. నేటితరం దొంగ దీక్షల్లా కాకుండా, నిఖార్సుగా ఆమె నిరాహార దీక్ష చేశారు.

అందుకే ఆమె జీవితం అందరికీ ఆదర్శం. ఆ ఉద్దేశ్యంతోనే ఆమె జీవిత కథ ఆధారంగా ‘ఇంఫాల్‌’ అనే సినిమా రూపొందించనున్నాడు బాలీవుడ్‌ దర్శకుడు వికాస్‌ కె ద్వివేది. ఈ సినిమా కోసం ముద్దుగుమ్మ తాప్సీని ఎంపిక చేశారట. అయితే ఇరోం షర్మిల పాత్రలో తాప్సీని చూడగలమా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాప్సీ అంటే క్యూట్‌ అండ్‌ బబ్లీ. అలాంటి తాప్సీ, ఇరోం షర్మిలగా నటించనుండడం ఆశ్చర్యం గొలపడం వింత కాదు. ఆమెను నీరసించిపోయిన పాత్రలో చూడటం కష్టమే. అయితే ఇది ఛాలెంజింగ్‌ రోల్‌. ప్రస్తుతం తెలుగు సినిమాల్లేవు తాప్సీకి. హిందీలో మాత్రం చేస్తోంది. ఈ పాత్రతో తాప్సీ పేరు దేశమంతా మార్మోగిపోనుంది.