ఆంధ్రప్రదేశ్‌కి రెండు లక్షల కోట్లు.

కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, అరుణ్‌ జైట్లీ ఈ రోజు మీడియా ముందుకు వచ్చి, ఆంధ్రప్రదేశ్‌కి కేంద్రం ఇస్తున్న ప్యాకేజీ, ఇప్పటివరకు చేసిన సాయం, ఇకపై చేయనున్న సాయం గురించి సవివరంగా చెప్పారుగానీ, ఇదంతా దేనికోసం? అన్న చర్చకు తావిచ్చారు. ప్రత్యేక ప్యాకేజీ గురించి అరుణ్‌ జైట్లీ ఏదో చెప్పేస్తారనుకుని ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల ప్రజానీకం ఎదురు చూడగా, అర్థరాత్రి వేళ తుస్సుమనిపించారు అరుణ్‌ జైట్లీ.

మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసే విషయంలో ఉదయం నుంచీ హైడ్రామా నడిపించారు. అలా ప్రజల్నీ, మీడియానీ అవమానించినట్లయ్యింది. ఇంతా చేసి, పది నిమిషాలు కూడా ఆంధ్రప్రదేశ్‌ గురించి అరుణ్‌ జైట్లీ మాట్లాడకపోవడం విమర్శలకు తావిచ్చింది. ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని అరుణ్‌ జైట్లీ చెప్పడంతో ఆంధ్రప్రదేశ్‌ భగ్గుమంది. దాంతో వెంకయ్యనాయుడు, అరుణ్‌ జైట్లీతో మాట్లాడి, మీడియా ముందుకు రావాల్సిందిగా కోరారట.

అలా వచ్చిన అరుణ్‌ జైట్లీ ఆంధ్రప్రదేశ్‌కి తాజాగా ప్రకటించిన ప్యాకేజీతో 2 లక్షల కోట్ల రూపాయల లబ్ది చేకూరుతుందని అన్నారు. వెంకయ్యనాయుడు ఇంకో పాతిక వేల కోట్లను అదనంగా చేర్చి 2 లక్షల పాతిక వేల కోట్ల రూపాయల లబ్ది అని ప్రకటించారు. ఇది కేవలం అంకెల గారడీ మాత్రమే. ఎన్ని వేల కోట్లు ఇచ్చినా అది ప్రత్యేక హోదాతో సరితూగబోదని ఆంధ్రప్రదేశ్‌లో విపక్షాలు స్పష్టం చేస్తున్నాయి.