‘మనమంతా’ అద్భుతహ

కమర్షియల్‌ హంగుల గురించి ఆలోచించకుండా తనకు నచ్చిన దారిలో విలక్షణ చిత్రాలు చేయడంలోనే సంతృప్తి చెందుతున్న దర్శకుడు చంద్రశేఖర్‌ ఏలేటి. చేసే ప్రతి చిత్రమూ విమర్శకుల ప్రశంసలు అందుకుంటూనే ఉంది. ఈ ప్రయత్నంలో అక్కడక్కడా నిరాశ ఎదురయినా, తన పంధాను వీడలేదాయన. ఆయన్నుంచి వచ్చిన తాజా చిత్రం ‘మనమంతా’ విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది.

మలయాళ్‌ సూపర్‌ స్టార్‌ అయిన మోహన్‌లాల్‌ను చాలాకాలం తర్వాత తెలుగు తెరపైకి తీసుకొచ్చిన ఘనత చంద్రశేఖర్‌ ఏలేటికే దక్కింది. మోహన్‌లాల్‌ని ఈ సినిమా కోసం ఏలేటి ఎందుకు తీసుకున్నాడో సినిమా చూస్తేనే అర్థమవుతుంది. అంత అద్భుతంగా ఉంది సినిమాలో ఆయన నటన. తొలి సినిమాతోనే టాలీవుడ్‌ దృష్టిని ఆకర్షించాడు మోహన్‌లాల్‌. ఇకపై ఆయనకు తెలుగు తెరపై తిరుగు లేదని ఈ సినిమా నిరూపించింది. ఆయనకు తెలుగు సినిమాపై ఉన్న అభిమానాన్ని ఈ సినిమాతో నిరూపించుకున్నారు.

అలనాటి సహజ నటి గౌతమి నటన ఈ సినిమాకి మరో అదనపు ఆకర్షణ. కమర్షియల్‌ హంగులకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్న ప్రస్తుత సినీ ఇండస్ట్రీలో ఈ సినిమా నిజంగా ఒక అద్భుతం అంటే ఒప్పుకోక తప్పదు. అందుకే కమర్షియల్‌ అంశాల కోణంలో కాకుండా, అత్యంత సహజత్వంతో ఈ సినిమాని తీర్చిదిద్దిన చంద్రశేఖర్‌ ఏలేటి గురించి ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో కీర్తించనివారు ఎవరూ లేరనడం అతిశయోక్తి కాదు.