బన్నీ కి అప్పట్లో రెజీనా ఇప్పుడు లావణ్య

కొన్ని సినిమాల రిజల్ట్ తారుమారైనా..అందులోని కొందరు నటీనటులకు మంచి పేరొస్తుంది. ‘అందాల రాక్షసి’ విషయంలో అదే జరిగింది. ఆ సినిమా నిరాశ పరిచినా.. ప్రధాన పాత్రలు చేసిన ముగ్గురికీ మంచి గుర్తింపు వచ్చింది. ముఖ్యంగా హీరోయిన్ లావణ్య త్రిపాఠి నూటికి నూరు మార్కులు కొట్టేసింది. ఈ సినిమా తర్వాత ఆమె కెరీర్ ఊపందుకోవడానికి కొంచెం టైం పట్టింది కానీ.. ఏడాది నుంచి స్పీడ్ పెంచింది లావణ్య. భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్నినాయనా లాంటి సూపర్‌హిట్స్‌తో అందరి దృష్టిలో పడింది. లేటెస్టుగా ‘శ్రీరస్తు శుభమస్తు’తో మరో హిట్ ఖాతాలో వేసుకోవడమే కాదు.. తన అందం-అభినయంతోనూ మెప్పించింది.

ఈ సినిమాలో లావణ్య ప్రదర్శనకు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మంచి కాంప్లిమెంట్ ఇచ్చాడు. సాధారణంగా బన్నీ భార్య స్నేహకు ఏ హీరోయిన్ కూడా నచ్చదట. ఇప్పటిదాకా ఏ కథానాయికనూ ఆమె మెచ్చుకోలేదట. కానీ లావణ్య త్రిపాఠి మాత్రం తన భార్యకు బాగా నచ్చేసిందని చెప్పాడు బన్నీ. బహుశా, లావణ్య నాతో నటించలేదు కాబట్టి అలాంటి కాంప్లిమెంట్ ఇచ్చిందేమో అంటూ నవ్వేశాడు. తన భార్యకు నచ్చిందంటే ఇక ప్రతి ఒక్కరికీ లావణ్య అంటే ఇష్టమని తనకు అర్థమైందని.. ఈ అమ్మాయిపై తనకు కూడా మంచి ఒపీనియన్ ఉందని చెప్పుకొచ్చాడు. ఇంతకుముందు తన తమ్ముడు శిరీష్‌తో జోడీ కట్టిన రెజీనా విషయంలోనూ ఇలాగే మాట్లాడాడు బన్నీ. ఇప్పుడు లావణ్యను పొగిడేస్తున్నాడు. ఇదంతా సినిమా ప్రచారంలో భాగమేనని కొందరు కొట్టిపారేసేవారూ ఉన్నారు.