పయ్యావులా? పరిటాలా?

ప‌య్యావుల కేశ‌వ్‌! టీడీపీలో అనంత‌పురానికి చెందిన సీనియ‌ర్ నేత‌! అన్న నంద‌మూరి తార‌క రామారావు ఉన్న‌ప్ప‌టి నుంచి ప‌య్యావుల సైకిల్‌పైనే తిరుగుతున్నారు. త‌న తోటి వారు ఒక‌రిద్ద‌రు ఇత‌ర పార్టీల్లోకి జంప్ చేసి  మ‌ళ్లీ వ‌చ్చి సైకిలెక్కినా.. ఈయ‌న మాత్రం అలాంటి జంప్‌లేవీ చేయ‌కుండా పార్టీలోనే ఉన్నారు. ఇక‌, ప‌దేళ్ల‌పాటు టీడీపీ విప‌క్షంగా ఉన్న స‌మ‌యంలోనూ ప‌య్యావుల పార్టీని వీడ‌లేదు. చంద్ర‌బాబుకు వ్య‌తిరేకంగా ఒక్క కామెంట్ కూడా చేయ‌లేదు. దీనికితోడు ఉర‌వ‌కొండ నియోజ‌క‌వ‌ర్గం స‌హా అనంతపురంలోనూ ప‌య్యావుల‌కు మంచి ఫీడ్ బ్యాకే ఉంది.

అయితే, ఇన్నాళ్లుగా టీడీపీకి సేవ‌చేస్తున్నా.. త‌న‌కు ఎలాంటి గౌర‌వం ద‌క్క‌లేద‌ని ఆయ‌న త‌న అనుచ‌రుల‌వ‌ద్ద అంటూనే ఉన్నారు. ఇక‌, ఇటీవ‌ల ఏపీ మంత్రి వ‌ర్గాన్ని ఇటీవ‌ల విస్త‌రించే అవ‌కాశం ఉంద‌ని చంద్ర‌బాబు సిగ్న‌ల్ ఇవ్వ‌గానే ప‌య్యావుల త‌నంత‌తానుగా దీనిపై ఆస‌క్తిక‌ర కామెంట్లు చేశారు.తాను చిన్న‌చిన్న ప‌నుల‌కు త‌ప్ప పెద్ద‌పెద్ద ప‌ద‌వుల‌కు ప‌నికిరాన‌ని త‌న అనుచ‌రుల వ‌ద్ద అనేశారు. ఈ నిర్వేదం ఇప్పుడు టీడీపీ అధినేత‌, సీఎం చంద్ర‌బాబు దృష్టికి వెళ్లింద‌ని అంటున్నారు తెలుగు త‌మ్ముళ్లు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న‌ను ఎలాగైనా మంత్రి వ‌ర్గంలోకి తీసుకోవాల‌ని కూడా భావిస్తున్న‌ట్టు తెలిసింది.

ఇదిలావుంటే, అనంత‌పురం నుంచి ప‌రిటాల సునీత‌, ప‌ల్లె ర‌ఘునాథ్‌లు మంత్రి వ‌ర్గంలో ఉన్నారు. దీంతో ఇప్ప‌డు ప‌య్యావుల‌ను కూడా తీసుకుంటే ర‌చ్చేన‌ని బాబు మ‌రో ఆలోచ‌న చేస్తున్నారు. దీంతో ప‌ల్లె, లేదా ప‌రిటాల‌ను ఒక‌రిని మంత్రి ప‌ద‌వి నుంచి త‌ప్పించి ప‌య్యావుల‌కు ఛాన్స్ ఇవ్వాల‌ని భావిస్తున్నారట‌. మ‌రి ఇందులోనూ ఓ చిక్కుంద‌ని చెబుతున్నారు తెలుగు త‌మ్ముళ్లు! అదేంటంటే ప‌రిటాల సునీతకు స్థానికంగా ప‌య్యావుల క‌న్నా మంచి ప‌లుకుబ‌డి ఉంద‌ట‌. మ‌రి ప‌ల్లె విష‌యానికి వ‌చ్చినా.. ఆయ‌న కూడా టీడీపీలో ఎన్నో ఏళ్లుగా ఉన్నారు.అదేస‌మ‌యంలో ప‌రిటాల‌కు ఇటీవ‌ల మంత్రి ప‌రంగా బాబు చేయించిన స‌ర్వేలో ఓ మాదిరి మార్కులే వ‌చ్చాయ‌ట‌. అలాగే పల్లెను త‌ప్పించాలంటే సునీత‌, కేశ‌వ్ ఇద్ద‌రూ ఒకే సామాజిక‌వ‌ర్గానికి చెందిన వారు అవుతారు. దీంతో ప‌ల్లెను కొన‌సాగించి.. ప‌రిటాల స్థానంలో ప‌య్యావుల‌ను తీసుకుంటే ఎలా ఉంటుంది? అనే విషయంపై బాబు త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్న‌ట్టు స‌మాచారం. ఏదేమైనా ప‌య్యావుల‌ను మాత్రం ఈ ద‌ఫా మంత్రి వ‌ర్గంలోకి తీసుకోవ‌డం ఖాయంగానే క‌నిపిస్తోంద‌ని అంటున్నారు బాబు స‌హ‌చ‌రులు కూడా!