నయీం కేసులో కొత్త కోణం

గ్యాంగ్‌స్టర్‌ నయీం కేసులో మరో కొత్త కోణం వెలుగుచూసింది. ఇటు సిట్‌ విచారణలో కొత్త కొత్త విషయాలు వెలుగు చూస్తుంటే.. అటు పోలీస్‌ స్టేషన్‌కు క్యూ కట్టే బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. తాజాగా నయీం అనుచరుల ఆగడాలను కూడా సిట్‌ బయటపెడుతోంది. నయీం ఇంట్లో వంటమనిషిగా చెలామణి అవుతున్న ఫర్హాన్‌ను నయీం సోదరిగా సిట్‌ తేల్చింది. ఫర్హాన్‌ పేరుమీద కోట్ల విలువైన రిజిస్ట్రేషన్‌ పత్రాలు ఉన్నాయి.

హైదరాబాద్,వరంగల్ మార్గంలో నయీం అనుచరులు భారీగా భూములు కాజేసినట్లు గుర్తించారు. నయీం ఇంటి నుంచి మొత్తం 9 మంది గల్లంతయ్యారని విచారణలో ఫర్హాన్‌ అంగీకరించింది. ఇప్పటి వరకు నలుగురిని సిట్‌ బృందం గుర్తించింది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో దొరికిన గుర్తుతెలియని మృతదేహాలకు నయీమ్‌తో లింకు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. నయీం కేసులో ఇప్పటివరకు 39 కేసులు నమోదయ్యాయి. 10 మందిని సిట్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. భువనగిరిలో నలుగురు, నల్గొండలో ఆరుగురిని అరెస్ట్ చేశామని, దర్యాప్తు కొనసాగుతోందని సిట్‌పోలీసులు తెలిపారు. నయీం బెదిరింపులకు పాల్పడిన వ్యాపారి గంపా నాగేందర్ ఫిర్యాదుపై సిట్ విచారణ ప్రారంభించింది. నయీం, నాగేందర్ ఫోన్ సంభాషణల ఆధారంగా దర్యాప్తును ముమ్మరం చేసింది. ఆ సంభాషణల్లో ప్రస్తావనకు వచ్చిన రాజకీయ నేతలతో సిట్ అధికారులు ఫోన్లో మాట్లాడారు.

మరోవైపు, నయీం భార్య, ఆయన బంధువుల పోలీసు కస్టడీ ముగిసింది. వారికి షాద్‌ నగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి షాద్‌ నగర్‌ కోర్టులో హాజరు పరిచారు. ఆ తర్వాత వారిని జిల్లా జైలుకు తరలించారు. అటు.. నయీం భార్య, బంధువుల నుంచి పోలీసులు కీలక సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది. డాన్‌ సెటిల్‌మెంట్లు, హత్యలు, ఆస్తులు, నెట్‌వర్క్‌ తదితర వివరాల్ని పోలీసులు రాబట్టినట్లు తెలుస్తోంది.