‘నగ్నసత్యం’ చెప్పిన రాధికా ఆప్టే

‘నా శరీరం గురించి నాకు తెలుసు. కంఫర్ట్‌గా ఉండబట్టే నటించాను. అందులో నేనేమీ ఇబ్బందిగా ఫీలవలేదు, ఫీలవను కూడా’ అని ‘పర్చేద్‌’ సినిమాకి సంబంధించి వెలుగు చూసిన న్యూడ్‌ వీడియోలపై స్పందించింది బాలీవుడ్‌ నటి రాధికా ఆప్టే. ఈ సినిమా విదేశాల్లో ఓ ఫిలిం ఫెస్టివల్‌లో ప్రదర్శితం కాగా, అక్కడి నుంచే న్యూడ్‌ వీడియోలు లీక్‌ అయ్యాయి. అందులో రాధికా ఆప్టే నగ్నంగా నటించింది.

సెక్స్‌ గురించీ మహిళా లోకం గళం విప్పాల్సిన సమయం ఆసన్నమయ్యిందని రాధిక ఈ సందర్భంగా పిలుపునిచ్చింది. కాలగమనంలో ఎన్నో మార్పులు వస్తున్నాయని చెబుతూ, సెక్స్‌ అనేది తప్పుడు వ్యవహారంగా చూడటం వల్ల అనేక సమస్యలు తలెత్తుతున్నట్లు ఆమె అభిప్రాయపడింది. ఇక ముందు కూడా మంచి సినిమాలు వస్తే, ఎలాంటి భయం లేకుండా నగ్నంగా నటించడానికైనా సిద్ధమని స్పష్టం చేసింది రాధికా.

తెలుగులో ‘లెజెండ్‌’ తదితర సినిమాల్లో నటించిన ఈ భామ, తమిళ సినిమాల్లో కూడా నటిస్తూ తనదైన ప్రత్యేకతను చాటుకుంది. ఇటీవల రాధిక నటించిన భారీ చిత్రం ‘కబాలి’ అంచనాల్ని అందుకోలేకపోయినా, ఆ సినిమాలో ఆమె నటనకు మంచి పేరొచ్చింది.