జిఎస్‌టి నష్టం ఏపీ వాటా 4,700 కోట్లు!

జిఎస్‌టి అమలుతో ఎపికి రూ.4,700 కోట్లు నష్టం వాటిల్లుతుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. ఏకీకృత పన్ను విధానం దేశానికి, రాష్ట్రాలకు ప్రయోజనకరమని, కేంద్ర, రాష్ట్రాల మధ్య వివాదాలను జీఎస్‌టీ కౌన్సిల్‌ పరిష్కరిస్తుందని పేర్కొన్నారు.  ఐదేళ్ల పాటు రూ. 23,500 కోట్ల నష్టాన్ని కేంద్రమే భర్తీ చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వ అధికారాన్ని వీటో చేసే అధికారం రాష్ట్రాలకు లేదు. రాష్ట్రాల అభిప్రాయాలను అలక్ష్యం చేయకుండా కేంద్రం న్యాయం చేయాలని ఆయన చెప్పారు.

జిఎస్‌టి బిల్లును రాజ్యసభ ఆమోదించినందుకు సంతోషంగా ఉందన్నారు. బిల్లును రాష్ట్ర ప్రభుత్వం స్వాగతిస్తోందని తెలిపారు. దేశ విస్తృత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని జిఎస్‌టి బిల్లును నిజమైన స్ఫూర్తితో స్వాగతిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. పన్ను సంస్కరణలకు మొదటి నుంచి తాము అనుకూలమేనని ఆయన చెప్పారు.  జిఎస్‌టి వల్ల సరుకులపై పన్ను తగ్గవచ్చు గానీ, సేవలపై పన్ను పెరిగే అవకాశం ఉందని యనమల అభిప్రాయపడ్డారు.