కన్నా వైసీపీ లోకి కన్ఫర్మ్

మాజీ మంత్రి, వైఎస్ కి రాజ‌కీయ స‌న్నిహితుడ‌యిన క‌న్నా ల‌క్ష్మీ నారాయ‌ణ ప్ర‌స్తుతం రాజ‌కీయంగా కొంత సందిగ్ధంలో ఉన్నారు. సుదీర్ఘ‌కాలం పాటు కాంగ్రెస్ రాజ‌కీయాల‌లో చక్రం తిప్పిన క‌న్నా మొన్న‌టి ఎన్నిక‌ల సంద‌ర్భంగా క‌మ‌లం గూటికి చేరారు. కాంగ్రెస్ కి భ‌విష్య‌త్తు లేద‌ని నిర్ణ‌యించుకుని కాషాయం గూటికి చేరితే ఇప్పుడా పార్టీ ప‌రిస్థితి కూడా అయోమ‌యంగా మారుతోంది. దేశంలో మోడీ గ్రాఫ్ ప‌డిపోవ‌డ‌మే కాకుండా..ప్ర‌త్యేకంగా ఏపీలో పువ్వుపార్టీకి పుట్టెడు క‌ష్టాలు త‌ప్ప‌వ‌నే అంచ‌నాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్ర‌త్యేక హోదా విష‌యం ఆ పార్టీని పీక‌ల్లోతు క‌ష్టాల్లో ముంచేసింది. క‌మ‌ల‌నాధులే రాజేసిన అంశం చివ‌ర‌కు వారి మెడ‌కు చుట్టుకుని గుక్క‌తిప్పుకోకుండా చేసింది. దాంతో బీజేపీ భ‌విష్య‌త్తు ఆగ‌మ్య‌గోచ‌రంగా మారింది.

ఈ ప‌రిస్థితుల్లో రాజ‌కీయంగా క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌కు వైఎస్సార్సీపీ మాత్ర‌మే ప్ర‌త్యామ్నాయంగా క‌నిపిస్తోంది. తెలుగుదేశం అధినేత‌తో క‌న్నాకి ఉన్న విరోధం అంద‌రికీ తెలిసిందే. దానికితోడు టీడీపీలోనే ఉన్న రాయ‌పాటి తోనూ క‌న్నాకి స‌ఖ్య‌త ఉండేది కాదు. అయిన‌ప్ప‌టికీ కాంగ్రెస్ లో కాబ‌ట్టి చెల్లిపోయింది. మిగిలిన చోట్ల అలాంటి ప‌రిస్థితులు సాధ్యం కాదు కాబ‌ట్టి కన్నా సైకిల్ స‌వారీకి అస‌లు అవ‌కాశ‌మే లేదు. ఇక మిగిలింది వైఎస్సార్సీపీ. ఆపార్టీ అధినేత జ‌గ‌న్ తో క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌కు కొంత మంచి సంబంధాలున్నాయి. అయిన‌ప్ప‌టికీ బీజేపీలో చేర‌డం అప్ప‌ట్లో ఆశ్చ‌ర్యం క‌లిగించింది. కానీ కావూరి వంటి వారితో పోలిస్తే క‌న్నాకు కేంధ్రంలో అధికారంలో ఉన్న పార్టీతో పెద్ద‌గా ప్ర‌యోజ‌నం ఉండ‌దు. ఆయ‌న‌కు ఇత‌ర ర‌కాలుగా కూడా క‌మ‌లం వల్ల ప్ర‌యోజ‌నం క‌నిపించ‌డం లేదు. కాబ‌ట్టి ఆపార్టీలో ఉండ‌డానికి ఆయ‌న తీవ్రంగా స‌త‌మ‌త‌మ‌వుతున్న‌ట్టు క‌న్నా అనుచ‌రులే చెబుతున్నారు. విష‌యాన్ని బీజేపీ నేతలు కూడా గ్ర‌హించారు.

అయితే ఇప్పుడే బీజేపీ నుంచి ఎవ‌రైనా జారిపోవ‌డం మొద‌ల‌యితే ప‌రిస్థితి తీవ్రంగా ఉండే అవ‌కాశం ఉంద‌న్న అంచ‌నాతో అధికార‌పార్టీ నేత‌లు రంగంలో దిగారు. ఏపీ మంత్రి మాణిక్యాల‌రావు స్వ‌యంగా క‌న్నా ఇంటికి వెళ్లి బుజ్జ‌గించారు. త్వ‌ర‌లో కాపు ఉద్య‌మం కూడా రాజుకుంటే క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌కు అధికార‌పార్టీ కంటే ప్ర‌తిప‌క్ష‌మే శ్రేయ‌స్క‌రం. అందుకే ఆయ‌న అటు చూస్తున్న‌ట్టు తెలియగానే బీజేపీ నేత‌లు రంగంలో దిగి బుజ్జ‌గింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు. అయితే అవ‌న్నీ తాత్కాలిక‌మేన‌ని చెబుతున్నారు. ఏపీలో టీడీపీ నేత‌లు టీడీపీ నేత‌లు చిన్న‌చూపు చూస్తున్నా ఏమీ చేయ‌లేని పార్టీలో ఉండి ఏంటి ప్ర‌యోజ‌నం అని క‌న్నా ప్ర‌శ్న‌కు బీజేపీ ద‌గ్గ‌ర స‌మాధానం లేక‌పోయింద‌ని అంటున్నారు. అయిన‌ప్ప‌టికీ ప‌రిస్థితులు మార‌తాయ‌ని..వేచి చూడాల‌ని మాత్రం చెప్పిన‌ట్టు ప్ర‌చారం సాగుతోంది.

మ‌రోవైపు క‌న్నా మాత్రం జ‌గ‌న్ అనుచ‌రుల‌తో నిత్యం ట‌చ్ లో ఉంటున్న‌ట్టు స‌మాచారం. ముఖ్యంగా త‌న మాజీ స‌హ‌చ‌రుల‌తో ఆయ‌న సంబంధాలు నెరుపుతున్న‌ట్టు చెబుతున్నారు. తొలుత పెద‌కూరపాడు నుంచి ఆత‌ర్వాత గుంటూరు వెస్ట్ నుంచి ప్రాతినిథ్యం వ‌హించిన ఆయ‌నకు వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి సీటు విష‌యంలో స్ప‌ష్ట‌త వ‌చ్చే అవ‌కాశం కూడా క‌నిపిస్తోంది. గ‌తంలో గుంటూరు వెస్ట్ నుంచి మోదుగ‌ల చేతిలో ఓడిపోయిన లేళ్ల అప్పిరెడ్డి తో పోలిస్తే క‌న్నా బ‌ల‌మైన క్యాండిడేట్ అని భావిస్తే గుంటూరులోనూ..లేకుంటే మ‌రోచోటన‌యినా క‌న్నాకు సీటు విష‌యంలో పెద్ద ఇబ్బంది ఉండ‌దంటున్నారు. దాంతో ఇక క‌న్నా జంపింగ్ ఖాయ‌మ‌నే చెప్ప‌వ‌చ్చు..