స్వీటీ కోసం దర్శకేంద్రుడు వెయిటింగ్!

హీరోయిన్స్ ను అందంగా-గ్లామరస్ గా చూపించడంలో దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు స్టైలే వేరు. ఆయన డైరక్ట్ చేసిన నటీమణుల్లో అనేకమంది ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేశారు. టాలీవుడ్-కోలీవుడ్-బాలీవుడ్ ల్లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అందుకే.. దర్శకేంద్రుడు డైరక్షన్ లో నటించేందుకు హీరోయిన్స్ ఉత్సాహం చూపుతుంటారు. ఆయన సినిమాలో అవకాశం వస్తే అదే పదివేలనుకునే వారికీ కొదువలేదు. ఇంతటి ఘనాపాటి ఓ అమ్మాయి కోసం పడిగాపులు పడ్డారంటే నమ్మగలరా? ఆ సుందరి ఎవరో కాదు. మన అందాల స్వీటి.. అనుష్క.

అనుష్క తన సినిమాలో ఎప్పుడు నటిస్తుందా అని రాఘవేంద్రరావు ఎదురుచూశారట. ఈ విషయం ఆయన తాజాగా ఫేస్ బుక్ లో వెల్లడించారు. “ఎటువంటి పాత్రనైనా అద్భుతంగా చేయగల ఆర్టిస్టులలో అనుష్క ఒకరు. బాహుబలి అయినా, రుద్రమదేవి అయినా తన పాత్రలకు తగ్గట్టుగా ఒదిగిపోతూ అందరినీ ఆశ్చర్యపరుస్తూనే వుంది. తనకి నా సినిమాలో తగిన క్యారెక్టర్ వస్తే పనిచేయాలని ఎప్పటినుంచో చూస్తున్నాను. ఇన్నాళ్లకి ‘ఓం నమో వేంకటేశాయ’ సినిమాలో అది కార్యరూపం దాల్చిందని రాఘవేంద్రరావు పేర్కొన్నారు. ఈ సినిమాలో అనుష్క భక్తురాలిగా నటిస్తోందని అన్నారు. తెలుగు సినీ ఉద్ధండుల్లో ఒకరైన దర్శకేంద్రుడి నుంచి అనుష్క ప్రశంసలు అందుకోవడం విశేషమే.