చెత్త మాట: చంద్రబాబు భయపడతారా!

నరేంద్రమోడీని చూసి చంద్రబాబు భయపడతారా? అన్న ప్రశ్న రాజ్యసభలో టిడిపి ఎంపి వేశారు. అసందర్భమైన ప్రశ్న ఇది. ప్రత్యేక హోదా అడగడానికి చంద్రబాబు భయపడుతున్నారనే వాదన ఉత్పన్నమవుతోంది. దానికి కారణం కూడా లేకపోలేదు. తెలుగుదేశం పార్టీ, ఎన్‌డిఏ ప్రభుత్వంలో భాగస్వామి. కాబట్టి, చంద్రబాబు తాను ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న రాష్ట్రానికి గతంలో రాజ్యసభ ద్వారా సంక్రమించిన ప్రత్యేక హోదా హక్కుని సాధించుకుని ఉండాలి.

నరేంద్రమోడీ ప్రభుత్వం అంటే అందులో చంద్రబాబు కూడా భాగమే గనుక, ఇది చాలా సులువైన పని. కానీ అది జరగడంలేదంటే, చంద్రబాబు భయపడుతున్నారనే సంకేతాలు వెళ్ళడం సహజం. దీనిపై వివరణ ఇచ్చుకోవడం, ఖండించుకోవడం కాదు ప్రత్యేక హోదా తెచ్చి చూపించగలగాలి. భారతీయ జనతా పార్టీ ప్రత్యేక హోదా ఇవ్వడంలేదని ఇదే సీఎం రమేష్‌ నినదిస్తున్నారు. ఆయనే చంద్రబాబు భయపడటంలేదని అంటున్నారు. ఎలా సాధ్యమిది? ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఎన్‌డిఎ ప్రభుత్వం నుంచి వైదొలగుతామని చంద్రబాబు హెచ్చరించి ఉంటే, ఆయన నరేంద్రమోడీకి భయపడటంలేదని ఒప్పుకోడానికి వీలుంటుంది.

ప్రత్యేకహోదాపై చర్చ సందర్భంగా టిడిపి తరఫున, ఆంధ్రప్రదేశ్‌ ప్రజల తరఫున నరేంద్రమోడీ ప్రభుత్వాన్ని నిలదీయాల్సింది పోయి, చంద్రబాబు భయపడతారా? అనే చెత్తమాటను సిఎం రమేష్‌ ఉపయోగించడం శోచనీయం.