కొత్తపల్లి గీత సరికొత్త రికార్డ్!

‘నన్ను గెలిపిస్తే నిరంతరం ప్రజా సేవకు అంకితమవుతాను. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాను. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటాను’. ఇది 2014 ఎన్నికల సమయంలో అరకు పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి వైసిపి తరుపున పోటీ చేసిన కొత్తపల్లి గీత అన్న మాటలు. ఆమె మాట నమ్మిన గిరిజనులు భారీ ఆధిక్యతతో గెలిపించారు. కాని గీత మాత్రం ఓట్లేసి గెలిపించిన గిరిజనులను మోసం చేసింది. నాటి నుంచి నియోజకవర్గానికి వచ్చిన పాపాన పోలేదు. అరకు ఎంపీగా ఎన్నికైన కొత్తపల్లి గీత తన నియోజకవర్గంలో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి పెట్టలేదు. తాగునీటి సౌకర్యం లేక ఊటగెడ్డల నీటిని తాగుతూ గిరిజనులు రోగాల బారిన పడుతున్నారు. వారికి తాగునీరు అందించేందుకు ఎటువంటి చర్యలూ చేపట్టలేదు. ఏజెన్సీలో పెద్ద సంఖ్యలో గిరిజనులు జబ్బుల బారిన పడుతున్నారు. అక్కడి ఆస్పత్రుల్లో వైద్య సిబ్బంది లేక ప్రజలకు సరైన వైద్య సేవలు అందడం లేదు. ఏజెన్సీలో పెద్ద సంఖ్యలో మాతా శిశుమరణాలు సంభవిస్తున్నాయి. వాటి గురించి ఆమె పట్టించుకున్న దాఖలాల్లేవు. హుకుంపేట, జి.మాడుగుల, ముంచంగిపుట్టు మండలాల్లో ఆంత్రాక్స్‌తో కొంత మంది గిరిజనులు మృత్యువాత పడగా, మరికొంత మంది కెజిహెచ్‌లో వైద్య సేవలు పొందారు. ఆ సమయంలో కనీసం వారిని పరామర్శించడానికి కూడా రాలేదు. హుదూద్‌ తుపాన్‌కు ఏజెన్సీలో తీవ్ర నష్టం వాటిల్లింది. అనేక ఇళ్లు నేలమట్టమయ్యాయి. కాఫీ తోటలు ధ్వంసమయ్యాయి. పర్యాటకం పూర్తిగా దెబ్బతింది. అయినా ఆమె ఆ సమయంలో నియోజకవర్గంలో పర్యటించనూ లేదు. గిరిజనులకు నష్టపరిహారం గురించి మాట్లాడనూ లేదు. కాని మూడు నెలల తరువాత నందివలసలో స్వచ్ఛ భారత్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీంతో అప్పట్లోనే గిరిజనులు ఆమెను నిలదీశారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఏజెన్సీ గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఎంపీ గీత మాట్లాడిన సందర్భం ఒక్కటీ లేదు. ఓట్లేసి గెలిపించిన గిరిజనులకు ఏమాత్రం ఉపయోగపడని గీత అరకుకు అద్దాల రైలు వేయాలని రైల్వే అధికారులను కోరుతున్నారు.

ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి పిలుపు మేరకు అరకు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని అనంతగిరి పంచాయతీని దత్తత తీసుకున్నారు. అయితే ఆ గ్రామానికి ఎంపీ చేసినదేమీ లేదు. దత్తతకు రిజిస్ట్రేషన్‌ కూడా చేయించుకోలేదు. ఆ గ్రామంలో ఉన్న సమస్యలేమిటో కూడా తెలుసుకోలేదు. మన్యంలో బాక్సైట్‌ తవ్వకాలకు 2015 నవంబర్‌లో రాష్ట్ర ప్రభుత్వం జిఒ 97ను విడుదల చేస్తే దానికి వ్యతిరేకంగా ఎంపీ గీత ఒక్క మాట కూడా మాట్లాడలేదు. గిరిజనులు, గిరిజన ఉద్యోగులు, విద్యార్థులు, మేధావులు ఇలా అందరూ పెద్ద ఎత్తున పోరాటం చేస్తే వారికి సంఘీభావం కూడా ఆమె ప్రకటించలేదు. ఆ సమయంలో ఆమె నియోజకవర్గం వైపు కన్నెత్తి కూడా చూడలేదు. బాక్సైట్‌ తవ్వకాల్లో వాటాలు, కమీషన్ల కోసం గీత ప్రయత్నించినట్లు వైసిపి నాయకులు ఆరోపించారు.

అలాగే గీత ఎస్టీ కాదని ఆమెకు ప్రత్యర్థిగా టిడిపి నుంచి పోటీ చేసిన గుండా సుధారాణి అప్పట్లో పిటిషన్‌ వేయడంతో ఇదంతా పసిగట్టి కుల వివాదం నుంచి బయటపడేందుకు బిజెపి, టిడిపిలకు దగ్గరయ్యేందుకు ఆమె ప్రయత్నించిందన్న విమర్శలు అప్పట్లో వినిపించాయి. అందుకే వైసిపి నుంచి గెలిచిన ఆమె ఎన్నికైన కొద్ది రోజులకే తాను బిజెపి, టిడిపిలతో కలిసి పనిచేస్తానని చెప్పి, వైసిపిపై విమర్శలు గుప్పించింది. అలాగే గీత, ఆమె భర్త రామకోటేశ్వరరావు కలిసి తప్పుడు ధ్రువపత్రాలతో పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు నుంచి రూ.25 కోట్ల రుణం తీసుకున్నారని, ఆ మొత్తాన్ని ఇతర అవసరాలకు మళ్లించి బ్యాంకును మోసం చేశారని, ఫలితంగా బ్యాంకుకు రూ.42.79 కోట్ల మేర నష్టం వాటిల్లిందని కొంత కాలం క్రితం సిబిఐ ఛార్జిషీట్‌ దాఖలు చేసింది. ఎంపీ గీత గిరిజనులను మోసం చేసి ఎస్టీ పేరుతో దగా చేశారని, అనేక చట్టవ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నారంటూ వైసిపి నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఏది ఏమైనా ఎంపీగా గీత గెలిచి రెండేళ్లు పూర్తయినా అరకు పార్లమెంట్‌ పరిధిలో ఆమె పర్యటించకపోవడంతో ఈ ప్రాంత ప్రజలు అసలు తమకు ఎంపీ ఉన్నారో లేదోనని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.