ఎట్టకేలకు నోరు విప్పిన చిరంజీవి..

ముద్రగడ పద్మనాభం అరెస్టు ఖండిస్తున్నట్లు రాజ్యసభ ఎంపీ చిరంజీవి బహిరంగ లేఖ రాశారు. అంతేకాదు తుని ఘటనను సీబీఐ విచారణ చేపట్టి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా చిరంజీవి పేర్కొన్నారు. దాంతో పాటు తుని ఘటనలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలను ఎవరూ సమర్థించరని పేర్కొన్నారు. ముద్ర‌గ‌డ దీక్ష‌కు దిగిన సంద‌ర్భంగా పోలీసులు ఆయ‌న ప‌ట్ల వ్య‌వ‌హ‌రించిన తీరుపై చిరంజీవి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్ర‌భుత్వం ముద్ర‌గ‌డ‌పై వ్య‌వ‌హ‌రిస్తోన్న తీరు క‌క్ష సాధింపు చ‌ర్య‌లా ఉంద‌ని ఆయ‌న అన్నారు. తుని ఘటనలను పురస్కరించుకుని చేస్తున్న అరెస్ట్లు ఏకపక్షంగా ఉన్నాయని చిరంజీవి తన లేఖలో పేర్కొన్నారు.తుని ఘటనలో గోదావరి జిల్లాల వాసులు ఎవరూ లేరని చెప్పిన చంద్రబాబు… ఇప్పుడు అక్కడ చేస్తున్న అరెస్ట్లను ఏవిధంగా సమర్థించుకుంటారని ప్రశ్నించారు.

అంతేకాదు తుని ఘటన బాధ్యులను గుర్తించి చట్టప్రకారం చర్యలు తీసుకోవాల్సిందేనని చిరంజీవి లేఖలో పేర్కొన్నారు. హింసకు పాల్పడిన నిందితులను గుర్తించి వారిపై తగినచర్యలు తీసుకోవాలన్నారు.
సున్నితమైన సామాజిక సమస్యల పరిష్కారంలో ప్రదర్శించాల్సిన రాజకీయ పరిణితి లేకుండా కక్షగట్టినట్లు వ్యవహరించడం ప్రజాస్వామ్యంలో తగదని చిరంజీవి అన్నారు. తుని ఘటన అంశంలో ప్రభుత్వం సంయమనం పాటించి సమస్యను పరిష్కరించాలని చిరంజీవి సూచించారు. సిబీఐ విచారణ ద్వారానే తుని ఘటన నిందితుల్ని చట్టానికి పట్టించే కార్యక్రమం జరగాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. మొదటి నుంచి ముద్రగడ పద్మనాభం పట్ల ప్రభుత్వ అనుసరిస్తున్న పంథా…ఘర్షణాత్మకంగా ఉందన్నారు. ఆయన చేస్తున్న దీక్షకు రాజకీయాల్ని ఆపాదించి సమస్యను పక్కదారి పట్టించడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటో ముఖ్యమంత్రికే తెలియాలన్నారు.