2023లో భారీ నష్టాలు వచ్చిన సినిమాలు ఇవే.. ఒక్కో దానికి ఎంత నష్టం అంటే

కొన్ని సినిమాలపై ప్రేక్షకులకు చాలా అంచనాలు ఉంటాయి. అవి ఎప్పుడు థియేటర్లలో విడుదల అవుతాయోనని అంతా ఎదురు చూస్తారు. తీరా అవి విడుదలైన తర్వాత సరిగ్గా లేకుంటే ఫలితం తారు మారు అవుతుంది. సినీ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్లు భారీగా నష్టపోతారు. ఇలా 2023లో చాలా సినిమాలు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. ఊహించని రీతిలో పరాజయం ఎదురు కావడంతో బాక్సాఫీసు వద్ద ఘోరంగా విఫలమయ్యాయి. ఈ జాబితాలో ఉన్న సినిమాలను పరిశీలిద్దాం.

సమంత హీరోయిన్‌గా ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించిన శాకుంతలం విడుదలకు ముందు ప్రేక్షకులలో ఎంతగానో అంచనాలు పెంచింది. దీనిని ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఎంతో ఖర్చు పెట్టి నిర్మించారు. తీరా విడుదలైన తర్వాత డిజాస్టర్ గా మిగిలిపోయింది. దీనికి రూ.65 కోట్లు ఖర్చు పెడితే చివరికి కేవలం రూ.20 కోట్లు మాత్రమే వచ్చాయి. ఇదే తన జీవితంలో ఊహించని షాక్ అని నిర్మాత దిల్ రాజు స్వయంగా ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. ఆ తర్వాత ఆ స్థాయిలో భారీ నష్టం తెచ్చిన సినిమా అఖిల్ నటించిన ఏజెంట్. ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి దీనిని తెరకెక్కించారు.


ప్రముఖ మలయాళ హీరో మమ్ముట్టి దీనిలో కీలక పాత్రలో నటించారు. పాన్ ఇండియా సినిమాగా రూపొందిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద బొక్కబోర్లా పడింది. రూ.60 కోట్లకు పైగా దీనికి నిర్మాతలు ఖర్చు పెట్టారు. కేవలం దీనికి రూ.33 కోట్లు మాత్రమే వచ్చాయి. దీనికి రూ.30 కోట్ల వరకు నష్టం వాటిల్లింది. ఇక నాగచైతన్య హీరోగా తెరకెక్కిన కస్టడీ సినిమా కూడా భారీ డిజాస్టర్ గా మారింది. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు ఈ సినిమాను రూపొందించారు. అయితే ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. దీనికి రూ.18 కోట్లకు పైగా నష్టం వచ్చిందని ఇండస్ట్రీ వర్గాల టాక్. ఇక గోపీ చంద్ హీరోగా వచ్చిన రామబాణం సినిమా కూడా భారీ నష్టాలను మిగిల్చింది. రూ.16 కోట్ల వరకు నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది.