వైసీపీలోకి జేసీ బ్రదర్స్..బైరెడ్డి రాజకీయం.!

వైసీపీ యువనేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి రాజకీయంగా దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఇంతకాలం కాస్త సైలెంట్ గానే ఉన్నా..వైసీపీలో పదవులు వచ్చాక వైసీపీని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. ఇక ఎలాంటి నాయకుడుపైన అయినా విరుచుకుపడటం చేస్తున్నారు. చంద్రబాబు-లోకేష్ టార్గెట్ గా తీవ్ర విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఇదే క్రమంలో తాజాగా బైరెడ్డి..తాడిపత్రికి వెళ్ళి అక్కడ జే‌సి బ్రదర్స్ పై తీవ్ర విమర్శలు చేశారు.

పైగా వారు వైసీపీలోకి రావాలని చూస్తున్నారని, కానీ తాము రానివ్వమని అంటున్నారు. జేసీ బ్రదర్స్, వారి వారసులు వైసీపీలోకి రావాలని చూస్తున్నారని, అయితే వారిని చేర్చుకునేది లేదని, తాడిపత్రిలో రౌడీ ఇజం చేసిన వ్యక్తులను ఎలా చేర్చుకుంటామని అన్నారు. జేసీ బ్రదర్స్ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని బైరెడ్డి ఆరోపించారు. పెద్దారెడ్డి ఎమ్మెల్యే అయ్యాక తాడిపత్రిలో ప్రజాస్వామ్యం నెలకొల్పారని, 2024 ఎన్నికల్లో వైసీపీ గెలిచే తొలి సీటు తాడిపత్రి అని చెప్పుకొచ్చారు.

అటు బైరెడ్డి చంద్రబాబుని సైతం టార్గెట్ చేసి మాట్లాడారు. బాబుని కుప్పం ప్రజలు 40 ఏళ్లపాటు గెలిపిస్తే.. ఏనాడూ అక్కడి ప్రజలను పట్టించుకోలేదని, కానీ జగన్ దెబ్బతో ఇప్పుడు నెలకోసారి కుప్పం పర్యటనలు పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. టీడీపీకి 75-80 నియోజకవర్గాల్లో అభ్యర్దులు లేరని, రాయలసీమలోని 30 నియోజకవర్గాల్లో టీడీపీ బీ ఫాం ఇచ్చినా పోటీకి సిద్దంగా ఎవరూ లేరని బైరెడ్డి ఎగతాళి చేశారు. మొత్తానికి పదవులు రావడంతో బైరెడ్డి..టి‌డి‌పి టార్గెట్ గా విరుచుకుపడుతున్నారు.