బలగం రివ్యూ: అసలు సిసలైన తెలంగాణ విలేజ్‌ డ్రామా.. ప్రియదర్శిని అదరగొట్టాడు!

కమెడియన్ వేణు టిల్లు ఫస్ట్ డైరెక్టోరియల్ బలగం. ఈ సినిమాలో ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రలలో నటించారు. బలగం సినిమాని దిల్ రాజు సమర్పణలో ఆయన కూతురు హన్షిత, హర్షిత్ రెడ్డి నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాని మార్చి 3 ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అయితే సినిమాపై నమ్మకంతో రెండు రోజుల ముందుగానే ప్రీమియర్ షోలు వేశారు. మరి ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.

స్టోరీ

అయితే ఈ సినిమా కథ గురించి మాట్లాడుడుకుంటే కొమరయ్య (సుధాకర్ రెడ్డి) అనే వ్యక్తికి ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉంటారు. ఇంతమంది ఉండి కూడా కొమరయ్య ఒంటరి ఉంటాడు. కూతురు, అల్లుడు ఎప్పుడు గొడవలు పడుతూ ఉంటారు. ఇంకోవైపు ఐలయ్య కొడుకు సాయిలు ( ప్రియదర్శి ) ఊరు నిండా అప్పులు చేస్తాడు. పెళ్లి చేసుకొని వచ్చే కట్నం డబ్బులతో ఆ అప్పుని తీర్చాలని ప్రయత్నాలు చేస్తుంటాడు.

సాయిలు ఎంగేజ్‌మెంట్ ఇంకో రెండు రోజుల్లో ఉందనగానే కొమరయ్య చనిపోతాడు. అయితే కొమరయ్యను చివరిచూపు చూడడానికి మేనత్త కూతురు సంధ్య ( కావ్య కళ్యాణ్ రామ్) వస్తుంది. అక్కడ సంధ్యను చూసి సాయిలు ఇష్టపడతాడు. మరదల్ని పెళ్లి చేసుకుంటే ఆమె ఆస్తి కూడా తనకే వస్తుందని ఆశపడతాడు సాయిలు. అయితే అతని ప్లాన్ వర్క్ ఔట్ అయిందా లేదా? అసలు కొమరయ్య కుటుంబంలో ఎందుకు గొడవలు వచ్చాయి? కొమరయ్య పిండాని కాకులు ఎందుకు ముట్టలేదు? చివరికి ఆ కుటుంబం అంత ఎలా కలుస్తుంది? అనేది ఈ సినిమా కథ.

సినిమా ఎలా ఉంది

తెలంగాణ పల్లెటూరి నేపథ్యంలో సాగే ఫక్తు తెలంగాణ మూవీ ఇది. `కాకి`చుట్టూ అల్లుకున్న కథ ఇది. కాకీ చాటున మానవీయ విలువలను, హ్యూమన్ వాల్యూస్, రిలేషన్ షిప్స్ కలగలిపి తెలంగాణ పల్లె జీవితాన్ని కళ్లకు కట్టిన మూవీ `బలగం`. ఏ సినిమాకైనా ఎమోషన్‌ ముఖ్యం. అది పండితే గనక ఆ సినిమా ఆడియెన్స్ ని ఆకట్టుకుంటుంది. దానికి భాషా భేదం ఉండదు. ఆ ఎమోషన్స్ ఆడియన్స్ కి కనెక్ట్ అది హిట్ అవుతుంది. అలాంటి ఎమోషన్స్ `బలగం` సినిమాలో పుష్కలంగా ఉన్నాయి. కాగా ఈ సినిమాలో కథే హీరో, కాకినే హీరోయిన్‌ కావడం విశేషం. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కాకీనే సినిమాని ముందుకు తీసుకెళ్తుంది. మనుషుల్లో ఉన్న స్వార్థాలను బయటపెడుతుంది, చిన్న గాలికే చెదిరిపోయే మానవ సంబంధాలను ప్రశ్నిస్తుంది.

ఆర్టిస్ట్స్ పెర్ఫార్మన్స్

ఈ సినిమాలో ప్రియదర్శి తన పాత్రలో నిజాయితీగా నటించాడు. అతను తన కామెడీ టైమింగ్‌తో పాటు ఎమోషనల్ కోణంతో కూడా ఆకట్టుకున్నాడు. అతను తన పాత్రలలోని చిన్న అమాయకత్వాన్ని చిత్రీకరించిన విధానం ప్రశంసనీయం, ఇది తన పాత్రకు గొప్ప విలువను జోడిస్తుంది. కావ్య కళ్యాణ్‌రామ్ హీరోకి నచ్చే పాత్రలో చాలా చక్కగా నటించింది. ఇక తాతగా సుధాకర్‌రెడ్డి అద్భుతంగా నటించారు. సినిమా మొత్తం ఆయన పాత్ర చుట్టే తిరుగుతుంది. సినిమాలో కుటుంబ సభ్యులుగా నటించిన నటీనటులందరూ వారి పాత్రలో వారు అద్భుతంగా నటించారు.

తీర్పు

ఈ సినిమాలో నిజమైన పల్లెటూరి జీవితాన్ని స్పష్టంగా చూపిస్తారు. ఇది కాకి చుట్టూ అల్లుకున్న మానవ సంబంధాలను, కుటుంబ అనుబంధాల గొప్పతనాన్ని చాటిన సినిమా.