ఈ సినిమా నిర్మాతకి ఈసారైనా హిట్ పడుతుందా? 

సినిమా జీవితం అంటేనే అవకతవకల ప్రపంచం. కానీ ఒక్కసారి అది తలకెక్కితే మాత్రం కుదురుగా ఉండనివ్వదు. ఎవరూ డబ్బులెక్కువయ్యి సినిమాలు తీయరు. ఎంతో ఇష్టంతోనే సినిమాలను నిర్మిస్తారు. అయితే ఈ క్రమంలో ఎన్నో అపజయాలను చవిచూస్తారు. ఇక్కడ సక్సెస్ అయినవారు అతి కొద్దమంది. ఎక్కడ చూసినా ఫెయిల్ అయినవారే ఎక్కువగా కనబడతారు. అంతెందుకు.. సినిమాలు తీసి నష్టపోయి సూసైడ్ చేసుకొని చనిపోయే వారు కూడా కోకొల్లలు. కానీ కొంతమంది ఎన్ని సార్లు అపజయం పాలైన మళ్లీమళ్లీ సినిమాలు తీస్తూ వుంటారు.

అలాంటివారిలో ఒకరే నిర్మాత సుధాకర్ చెరుకూరి. శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కిన రామారావు ఆన్ డ్యూటీ యాక్షన్ థ్రిల్లర్ రేపు శుక్రవారం అనగా జూలై 29 ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతోంది. ‘ఖిలాడి’ వంటి ప్లాప్ తర్వాత రవితేజ కు ఈ మూవీ సక్సెస్ ఎంతో అవసరం. అలానే ఎప్పటి నుంచో అసలు సిసలైన బ్లాక్ బస్టర్ కోసం వేచి చూస్తున్న నిర్మాత సుధాకర్ చెరుకూరి కూడా ఈ ప్రాజెక్ట్ పై చాలా ఆశలు పెట్టుకొని ఉన్నారు. ఇటీవల కాలంలో ఇండస్ట్రీలో బాగా వినిపిస్తున్న పేర్లలో సుధాకర్ చెరుకూరి ఒకటి.

శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ అనే బ్యానర్ మీద విభిన్నమైన మరియు కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలను నిర్మిస్తూ మంచి అభిరుచి గల నిర్మాత అనిపించుకున్నారు. కాకపోతే అందుకు తగ్గట్టుగా ఇప్పటి వరకూ అతను సరైన ఫలితం మాత్రం అందుకోలేకపోతున్నారు. ‘పడి పడి లేచె మనసు’ చిత్రంతో పూర్తి స్థాయి నిర్మాతగా మారాడు సుధాకర్ చెరుకూరి. తొలి సినిమాకే అందమైన ప్రేమకథను ఎంచుకున్నాడు. కధలు అయితే మంచిమంచివి చేస్తున్నాడు కానీ డబ్బులు మాత్రం రావడంలేదు. ఈ సినిమాతోనైనా నిర్మాత సుధాకర్ చెరుకూరికి మంచి డబ్బులు రావాలని ఆశిద్దాం.