మహేష్ అభిమానులకు శుభవార్త… పోకిరి సినిమా మళ్ళీ రాబోతోందోచ్!

ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాధ్ – సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో వచ్చిన పోకిరి సినిమా గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. పూరీ దర్శకత్వం గురించి మాట్లాడుకోవలసిన పనిలేదు. ఇక మహేష్ బాబు గురించి మాట్లాడుకోవాలంటే.. “మహేష్ అంటేనే పోకిరి, పోకిరి అంటేనే మహేష్” అన్న మాదిరి పెర్ఫామెన్స్ ఇచ్చాడు ఈ సినిమాలో. ఆ సినిమాతో మహేష్ బాబు నిజమైన సూపర్ స్టార్ గా అవతరించాడు. ఇకపోతే ఈ సినిమా విడుదలై దాదాపు 16 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంలో ఈ మూవీ మేకర్స్ ఓ వినూత్న ఒరవడికి శ్రీకారం చుట్టారు.

విషయం ఇదే:

ఈ సినిమాని నేటి అధునాతన డిజిటల్ సాంకేతికతను జోడించి రీరిలీజ్ చేస్తే ఎలా ఉంటుంది? అనే ఆలోచన చేసారు మేకర్స్. అనుకున్నదే తడవుగా ఇప్పుడు ఈ మూవీని 4K రిజొల్యూషన్ లోకి రీ మాస్టర్ చేసి డాల్బీ ఆడియోతో థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఆగస్ట్ 9న మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఇరు తెలుగు రాష్ట్రాల్లో భారీ ప్రీమియర్లు వేయనున్నారని తెలిసింది. ఇక ఈ సినిమా వచ్చి ఇన్నేళ్లు అవుతున్నా ఇప్పటికీ ఈ మూవీ బుల్లితెర TRPల్లో వెనకబడలేదు. ఎన్నిసార్లు టీవీల్లో వేసినా జనాలు ఈ సినిమాకి అతుక్కుపోయి మరీ చూస్తున్నారు.

ఈ సినిమా గురించి మరిన్ని విశేషాలు:

మహేష్ కెరీర్ లోనే పోకిరి రికార్డ్ బ్రేకింగ్ హిట్ అని చెప్పుకోవాలి. సరిగ్గా 16 ఏళ్ల క్రితం 2006 ఏప్రిల్ 28న ఈ సినిమా విడుదలైంది. ఈ చిత్రం అప్పటి వరకు తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న అన్ని రికార్డులను చెరిపేసింది. దాదాపు 12కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం అప్పట్లోనే 40 కోట్ల షేర్ వసూలు చేయడం ఇండస్ట్రీ రికార్డ్. 200 కేంద్రాల్లో 100 రోజులు పైగా నడిచి ఆల్ టైమ్ రికార్డుల్ని బ్రేక్ చేసింది. ఈ చిత్రాన్ని పూరీ జగన్నాథ్ వైష్టో అకాడమీ బ్యానర్ తో పాటు మంజుల తన ఇందిరా ప్రొడక్షన్స్లో సంయుక్తంగా తెరకెక్కించారు. ముఖ్యంగా మహేష్ ని రొటీన్ పాత్రల నుంచి బయటపడేసిన చిత్రమిది.