‘ అంటే సుంద‌రానికి ‘ పెద్ద దెబ్బ‌… నానికి మామూలు షాక్ కాదుగా..!

నేచురల్ స్టార్ నాని నటించిన అంటే సుందరానికి సినిమా ఈ వారంతంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా చూసిన వారందరూ బాగుందని మెచ్చుకున్నారు. రివ్యూలు కూడా బాగానే వచ్చాయి. వీ, టక్ జగదీష్ లాంటి ఫ్లాప్ సినిమాలు తర్వాత నాని అంటే సుందరానికి సినిమా పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. సినిమాకు టాక్ బాగున్నా.. బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత ఆశాజనకంగా లేదని ఈ సినిమా వసూళ్లు, ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

తొలిరోజు ఏపీ తెలంగాణలో రూ.4 కోట్ల వసూళ్లు రాబట్టిన సినిమా రెండో రోజు కూడా పర్వాలేదనిపించాడు. అయితే మూడో రోజు అడ్వాన్స్ బుకింగ్ లు అనుకున్న స్థాయిలో లేవు. ఆదివారం కాబట్టి భారీ వసూళ్లు వస్తాయని ఆశలు పెట్టుకున్నా అడ్వాన్స్ బుకింగ్ లతోపాటు థియేటర్ల దగ్గర అనుకున్న స్థాయిలో సందడి కనిపించడం లేదు. సినిమా రన్ టైం ఎక్కువగా ఉందని కామెంట్లు వస్తున్నా నిర్మాతలు మాత్రం సీరియస్ గా తీసుకున్నట్లు కనిపించడం లేదు.

సినిమా రన్ టైం 15 నుంచి 20 నిమిషాలు ట్రిమ్ చేస్తే అది చాలా ప్లస్ అవుతుందని చెబుతున్నా.. ఆ దిశగా మేకర్స్ ఆలోచనలు చేయడం లేదు. మరోవైపు తెలంగాణలో టికెట్ రేట్లు ఇప్పటికే పెద్ద సినిమాలపై సైతం భారీగా ప్రభావం చూపుతున్నాయి. ట్రేడ్ వర్గాలతోపాటు సామాన్య ప్రేక్షకులు ఎంత మొత్తుకుంటున్నా నిర్మాతలు మాత్రం టికెట్ రేట్లు తగ్గించే విషయంలో చాలా లైట్ తీసుకుంటున్నారు. మేజర్ , విక్రమ్ సినిమాలకే హైదరాబాద్ లో మల్టీప్లెక్స్ లో రూ.195 రూపాయలు రేటు ఉంటే.. అంటే సుందరానికి సినిమాకి మాత్రం ఏకంగా 250 రూపాయలకు పెంచేశారు.

ఇలాంటి అంశాలే సినిమా ఫలితాలపై ప్రభావితం చేస్తున్నాయి. నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు టికెట్ రేట్లు ఎక్కువగా ఉంటే ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు రారని ముందుగానే ఊహించి ఎఫ్ 3 సినిమా టికెట్ రేట్లను తగ్గించేశారు. పైగా ఎఫ్3 సినిమాకు హిట్ టాక్ వచ్చినా కూడా వసూలు రాలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు అంటే సుందరానికి సోసో గా టాక్ వచ్చింది. రన్ టైం ఎక్కువగా ఉందన్న కంప్లైంట్ కూడా ఉంది. ఇలాంటి టైంలో ₹250 టికెట్ రేటు ఉంటే థియేటర్లకు ప్రేక్షకులు వచ్చి ఎలా సినిమా చూస్తారు అన్న ప్రశ్నలు కూడా ఈ సినిమా విషయంలో ఉత్పన్నమవుతున్నాయి.

మామూలుగా నాని సినిమాకు ఫస్ట్ వీకెండ్ ముగిసేసరికి రూ.8 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు వసూళ్లు నమోదు అవుతాయి. అంటే సుందరానికి సినిమా విషయంలో ఫస్ట్ వీకెండ్ కి రూ.5 కోట్లు వస్తేనే గొప్ప అన్నట్లుగా వాతావరణం ఉంది. మరోవైపు ఏపీలో టికెట్ రేట్లు తక్కువగా ఉండడంతో.. అక్కడ డీసెంట్ నెంబర్స్ కనిపిస్తున్నాయి. దాదాపు రూ. 30 కోట్లకు కాస్త అటు ఇటుగా థియేట్రికల్ బిజినెస్ చేసుకున్న అంటే సుందరానికి సినిమా ఫస్ట్ వీక్ ఎండ్ ముగిసేసరికి రూ.10 నుంచి 12 కోట్ల మధ్యలో మాత్రమే షేర్ రావటం గమనార్హం.

ఇక సోమవారం నుంచి అంటే సుందరానికి సినిమాకి అసలు సిసలు పరీక్ష మొదలు కానుంది. ఇప్పటికే థియేట్రికల్ బిజినెస్ టార్గెట్ లో సగం టార్గెట్ కూడా నాని పూర్తి చేయలేదు. మరోవైపు విక్రమ్, మేజర్ రెండు సినిమాలు కూడా సెకండ్ వీకెండ్ లో కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. విక్రమ్ తెలుగు నాట ఇప్పటికే రూ.25 కోట్లకు పైగా వసూళ్లను కొల్లగొట్టి సెకండ్ వీకెండ్ లో కూడా దూసుకుపోతోంది. ఈ రెండు సినిమాలు స్ట్రాంగ్ గా ఉండడం కూడా అంటే సుందరానికి సినిమాపై పెద్ద ప్రభావం చూపించిందని చెప్పవచ్చు . ఏదేమైనా నాని ఈ కష్టాలను ఎలా గట్టెక్కుతారో చూడాలి.

Share post:

Popular