టిక్కెట్ రాద‌న్న డౌట్‌… టీడీపీ ట‌చ్‌లో వైసీపీ ఎమ్మెల్యే…!

ఆయ‌న‌కు ప్ర‌జాభిమానం ఎక్కువ‌. గ‌త ఎన్నిక‌ల్లో భారీ మెజారిటీ సాధించి విజ‌యం ద‌క్కించుకున్నారు. ఎంత అంటే.. ఏకంగా సీఎం జ‌గ‌న్‌కు స‌రిస‌మాన‌మైన మెజారిటీతో విజ‌యం సాధించారు. ఆయ‌నే ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాలోని గిద్ద‌లూరు ఎమ్మెల్యే.. అన్నారాంబాబు. అయితే.. ఆయ‌న ఇంత ప్ర‌జాభిమానం ద‌క్కించుకున్నా.. పార్టీలో ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేదు. ఎవ‌రూ ఆయ‌నను ఖాత‌రు చేయ‌డం లేదు. క‌నీసం.. అధిష్టానం అయినా.. ఆయ‌న‌ను పట్టించుకుంటోందా? అంటే అది కూడా క‌నిపిం చ‌డం లేదు. దీనికి కార‌ణం.. ఆయ‌న నోటి దూలేన‌ని వైసీపీ నాయ‌కులు చెబుతున్నారు.

“ఆయ‌న ఎప్పుడుఏం మాట్లాడ‌తారో తెలియదు., ఆయ‌న నోటికి ఏం వ‌స్తుందో తెలియ‌దు. ప్ర‌జ‌ల మ‌ధ్య ఉండ‌మంటే.. ఉండ‌రు“ అని వైసీపీ నాయ‌కులు బాహాటంగానే చెబుతున్నారు. అంతేకాదు.. త‌మ‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని.. దాదాపు గిద్ద‌లూరు నియోజ‌క‌వ‌ర్గంలోని నాలుగు మండ‌లాల్లో ఉన్న రెడ్లు ఎగ‌స్పార్టీ అయ్యారు. అన్నాను మార్చాల్సిందే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ ఇవ్వొద్దు.. ఇస్తే.. మేమే ఓడిస్తాం.. అంటూ.. అధిష్టానానికి ఓ వారం కింద‌ట ఫిర్యాదు చేశారు. అంతేకాదు.. ఆయ‌న‌ను ప్ర‌జ‌లు కూడా వ్య‌తిరేకిస్తున్నార‌ని వారు చెప్పుకొచ్చారు.

ఇవ‌న్నీ .. తెలిసిన త‌ర్వాత‌.. అధిష్టానం కూడా ఆయ‌న‌ను ప‌క్కన పెట్టిన‌ట్టు తెలుస్తోంది. పైగా.. టీడీపీ నేత‌ల‌తో ట‌చ్‌లో ఉన్నార‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలో ప‌వ‌న్ కామెంట్ల‌కు గిద్ద‌లూరు యువత భారీ ఎత్తున లైకులు కొడుతోంది. దీంతో ఇదంతా కూడా అన్నానే చేయిస్తున్నార‌ని వైసీపీ నాయ‌కులు భావిస్తున్నారు. ఈ ప‌రిణామాలు వాడి వేడిగా ఉన్న‌ప్ప‌టికీ.. అన్నా మాత్రం సైలెంట్ గా ఉన్నారు. ఎవ‌రో ఏదో అనుకుంటున్నార‌ని.. తాను స్పందించ‌నని.. తాను వైసీపీలోనే ఉన్నాన‌ని.. చెబుతున్నారు. ఇటీవ‌ల యూట్యూబ్ ఛాన‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు వివాదం కూడా అయ్యాయి.

కొంద‌రు తిండి ఎక్కువైన వైసీపీ నాయ‌కులు త‌న‌పై ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని అన్నారు. ఇది చిలికి చిలికి గాలి వాన‌గా మారింది. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ప‌రిస్తితిని త‌న‌కు అనుకూలంగా మార్చుకోక‌పోతే.. వైసీపీ నేత‌లే ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా ప్ర‌చారం చేసే ప‌రిస్థితి వ‌స్తుంద‌న్న‌ది ప‌రిశీల‌కులు చెబుతున్న మాట‌. ఎందుకంటే.. ఎంత మెజారిటీ ఉన్న‌ప్ప‌టికీ.. మాట స‌రిగా లేకపోవ‌డంతో.. నాయ‌కులు ప‌లుచ‌న అవుతార‌ని చెబుతున్నారు. సొంతపార్టీ నేత‌ల‌ను కాద‌ని.. అన్నా గెలిచే ప‌రిస్థితి ఉండ‌ద‌ని అంచ‌నా వేస్తున్నారు. మ‌రి అన్నా.. నోటి తీరు.. మాట తీరు మార్చుకుంటారో లేదో చూడాలి.