రావుగోపాల్‌రావుకు 30 ఇయ‌ర్స్‌ పృథ్వీకి ఉన్న రిలేషన్ ఇదే.. ?

30 ఇయర్స్ ఇండస్ట్రీ అనే డైలాగు చెబుతూ తెలుగు ప్రేక్షకులలో గుర్తింపు తెచ్చుకున్న పృథ్వీరాజ్‌కి స్పెషల్‌గా ఇంట్రో అవసరం లేదు. ఎన్నో సినిమాల్లో తన కామెడీతో అలరించిన పృథ్వీరాజ్‌ కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్న సమయంలోనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత అతని సినీ కెరీర్‌ కాస్త నెమ్మదించింది. అయితే ఒక కారణం వల్ల రాజకీయాల నుంచి తప్పుకున్న ఈ కమెడియన్ ఇప్పుడు జనసేనకి మద్దతుగా, వైసీపీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నాడు. పలు ఇంటర్వ్యూలలో కూడా పాల్గొని ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకుంటున్నాడు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో కళాప్రపూర్ణ రావు గోపాల్ రావుతో తనకున్న పరిచయం గురించి చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు. పృథ్వీరాజ్‌ మాట్లాడుతూ త‌న‌ తండ్రి బాల‌నేని శ్రీనివాస్ కూడా యాక్టరే అని వెల్లడించాడు. తన తండ్రికి దర్శకుడు దాసరి నారాయ‌ణ రావు, నటుడు మోహ‌న్ బాబుల‌తో మంచి సంబంధాలు ఉండేవ‌ని తెలిపాడు. ఎన్టీఆర్ లాంటి దిగ్గజ నటులతో కూడా తన తండ్రి స్క్రీన్ షేర్ చేసుకున్నారని చెప్పుకొచ్చాడు.

రావు గోపాల్ రావు గురించి చెబుతూ.. సినిమాల్లో నటించాలనే కోరికతో తాను చెన్నైకి వెళ్లిపోయాన‌ని పృథ్వీరాజ్‌ చెప్పాడు. ఆ సమయంలోనే తెరకెక్కిస్తున్న ఆ ఒక్క‌టి అనే సినిమా ఆడిష‌న్స్‌కు వెళ్లానని.. అప్పుడు దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ తనని ఉద్దేశిస్తూ.. “మిస్టర్.పృథ్వీరాజ్‌, మీరు రావుగోపాల్ రావు గారు ఒప్పుకుంటేనే ఈ రోల్‌కు సెలెక్ట్ అవుతారు” అని అన్నారని తెలిపాడు. దాంతో రావు గోపాల్ రావు తనని సెలెక్ట్ చేస్తారో లేదో అని నెర్వస్ గా ఫీల్ అయ్యాడట.

ఆలోగా ఏవీఎం స్టూడియోలోకి వచ్చిన రావు గోపాల్ రావు పృథ్వీని చూసి “ఈ అబ్బాయేనా నా మేన‌ల్లుడు” అని ఈవీవీ సత్యనారాయణ అని అడగారట. అలా అడగడంతో త‌న‌ను రావుగోపాల్ రావు సెలెక్ట్ చేశారని తనకు అర్థం అయినట్లు పృథ్వీ తెలిపాడు. అలా ఆ ఒక్క‌టి సినిమాతో తనకు మంచి గుర్తింపు వచ్చిందని వెల్లడించాడు.

ఈ మూవీ షూటింగ్ టైమ్‌లో తను రావు గోపాలరావుతో ఒకే గ‌దిలో నలభై రోజులు గడిపాడని కూడా పృథ్వి తెలిపాడు. ఆ నలభై రోజుల సమయంలో తాను చిత్ర పరిశ్రమ గురించి చాలా తెలుసుకున్నానని పేర్కొన్నాడు. రావు గోపాల్ రావుతో ఉన్న ఆ రోజులను తాను ఎప్పటికీ మరిచిపోలేని చెప్పుకొచ్చాడు. పృథ్వి దాదాపు 100 సినిమాల్లో ఎన్నో పాత్రలు పోషించాడు.