గాంధీ కుటుంబ రాజకీయ వారసురాలు ప్రియాంక గాంధీ పూర్తి స్తాయిలో రాజకీయాల్లోకి రావాలన్న డిమాండ్లు గత కొంత కాలంగా వినిపిస్తున్నాయి. గత యూపీ ఎన్నికలకు ఆమె ఇన్‌చార్జ్‌గా ఉన్నా ఉపయోగం లేకుండా పోయింది. యూపీలో కాంగ్రెస్ ప్రభావం చూపలేదు. ఆమె చట్టసభలకు ఎంపికై మరింత క్రియాశీల పాత్ర పోషిస్తేనే కాంగ్రెస్‌కు కాస్త పూర్వవైభవం వస్తుందనే అంచనాలు ఉన్నాయి. తాజాగా ప్రియాంకగాంధీని కర్ణాటక నుంచి రాజ్యసభ సభ్యురాలిగా పంపేందుకు కసరత్తు సాగుతున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఉదయ్‌పూర్‌లో కాంగ్రెస్ చింతన్ శిబిర్ జరుగుతోంది. ఈ సమావేశంలోనే ప్రియాంకను రాజ్యసభకు నామినేట్ చేసే అంశం చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కర్నాటక కోటాలో రాజ్యసభ సభ్యులుగా ఉన్న బీజేపీకి చెందిన కేసీ రామమూర్తి, నిర్మలాసీతారామన్, కాంగ్రెస్‌కు చెందిన జైరాంరమేశ్ పదవీ కాలం ముగుస్తోంది. వీరితో పాటు కేంద్రమాజీ మంత్రి అస్కర్‌ఫెర్నాండెజ్ మృతితో ఖాళీ అయిన స్థానంతో కలిపి మొత్తం నాలుగు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
ఇందిరా గాంధీ కాలం నుంచి కూడా కర్నాటకతో ఆ కుటుంబానికి మంచి సంబంధాలే ఉన్నాయి. ఇందిరాగాంధీకి రాజకీయ పరమైన ఇబ్బందులు కలిగినప్పుడు కూడా కర్నాటక కాంగ్రెస్ నేతలు ఇందిరను తమ రాష్ట్రానికి ఆహ్వానించి చిక్కమగళూరు లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయించి విజయం సాధించేలా చేశారు. దీంతో ఇప్పుడు ఆ సెంటిమెంట్ ప్రకారం ప్రియాంకను కూడా ఇక్కడ నుంచి రాజ్యసభకు పంపే ప్రయత్నాలు నడుస్తున్నాయి.
ప్రస్తుతం ఇక్కడ నుంచి ఎంపీగా ఉన్న జైరాంరమేశ్ వల్ల రాష్ట్రానికి, రాష్ట్ర పార్టీకి ఒనగూరింది లేదని ఓ వర్గం వ్యతిరేకతతో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే వారు ప్రియాంక పేరు ప్రతిపాదిస్తున్నారు.
షాకింగ్: ఎంపీగా ప్రియాంక గాంధీ…!
