ఎన్టీఆర్ సినిమా నుంచి చిరంజీవి అవుట్‌… మోహన్‌బాబు ఇన్‌… రీజ‌న్ ఇదే…!

తెలుగు సినిమాకు రెండుకళ్లుగా ఎన్టీఆర్, ఏఎన్‌ఆర్‌లను చెబుతుంటారు. వారిద్దరూ మంచి స్వింగ్‌లో ఉండగానే చిత్ర పరిశ్రమలోకి చిరంజీవి వచ్చారు. ఇండస్ట్రీలో దిగ్గజాలు ఉండగానే తనదైన మేనరిజంతో టాలీవుడ్‌లో తిరుగులేని రారాజుగా ఎదిగారు. ఆయన నటించిన సినిమాలో 80 శాతం బ్లాక్‌బస్టర్లుగా నిలిచాయి. ఇక తన సినీ కెరీర్‌లో ఎన్టీఆర్, ఏఎన్‌ఆర్‌ ఇద్దరితోనూ మెగాస్టార్ నటించారు. అయితే ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో ఎన్టీఆర్ నటించిన ఓ ప్రముఖ సినిమాలో ఓ ముఖ్య పాత్రకు తొలుత చిరంజీవిని తీసుకున్నారు.

కేవలం 5 రోజుల్లోనే ఆయనను తొలగించి, ఆ స్థానంలో మోహన్ బాబును తీసుకున్నారు. దీనికి తెరవెనుక జరిగిన నేపథ్యం ఇలా ఉంది. రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా 1981 కొండవీటి సింహం సినిమా రిలీజ్ అయింది. బాక్సాఫీసు వద్ద ఈ సినిమా మంచి వసూళ్లను సాధించి, బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ తనయుడిగా మోహన్‌బాబు నటించి, మెప్పించారు. అయితే మోహన్‌బాబు కంటే ముందే ఆ స్థానంలో చిరంజీవిని తీసుకున్నారు.

అప్పుడప్పుడే ఇండస్ట్రీలో చిరంజీవి ఎదుగుతున్నారు. సినిమాలో భాగంగా తండ్రి పాత్రలో ఉన్న ఎన్టీఆర్‌‌ను ఎదిరిస్తూ కొడుకు పాత్రలో చిరంజీవి డైలాగ్‌లు చెప్పాల్సి ఉంటుంది. అప్పటికే ఎన్టీఆర్ డేట్స్ తక్కువగా ఉన్నాయి. ఉన్న కొద్ది రోజుల్లోనే సినిమా పూర్తి చేయాల్సి ఉంది. ఈ దశలో చిరంజీవి తడబడే వారు. ఎన్టీఆర్‌ను ఎదిరించి డైలాగ్‌లు చెప్పలేకపోయేవారు. ఎన్టీఆర్ అంటే ఎంతో ఆరాధనా భావంతో మెలిగే వారు చిరంజీవి. అలాంటిది సినిమా అయినప్పటికీ ఎదిరిస్తూ డైలాగ్‌లు చెప్పలేకపోయారు.

దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో మోహన్‌బాబును చిరంజీవి స్థానంలో తీసుకున్నారు. అప్పటికే ఎన్టీఆర్‌తో సింహబలుడు అనే చిత్రంలో మోహన్ బాబు నటించారు. దీంతో మోహన్ బాబు ఎలాంటి బెరకు లేకుండా డైలాగ్‌లు చెప్పారు. ఆ సినిమా దిగ్విజయం సాధించింది. అయితే చిరంజీవికి ఎప్పటికీ మోహన్ బాబు సమానం కాదని సినీ విశ్లేషకులు చెబుతుంటారు. ఆయన సాధించిన విజయాలే అందుకు నిదర్శనం.

రాజకీయాల్లో విజయం సాధించకపోయినప్పటికీ తెలుగు సినీ ఇండస్ట్రీలో చిరంజీవికి తిరుగులేదు. 10 ఏళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్న చిరంజీవి ఖైదీ నంబర్ 150గా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. రూ.100 కోట్లకు పైగా వసూళ్లను సాధించి, ఆయన సత్తా ఏమిటో ఆ సినిమా చాటింది. ఇప్పటికీ కుర్రాళ్లకు ధీటుగా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు మెగాస్టార్. ఆయన నటించిన ఆచార్య సినిమా ఏప్రిల్ 29, 2022న విడుదలకు సిద్ధంగా ఉంది.