రాజ‌మౌళి అన్ని కోట్ల ఆస్తుల‌కు అధిప‌తి అయ్యాడా…!

ప్రస్తుతం తెలుగులోనే కాకుండా దేశవ్యాప్తంగా అగ్రదర్శకుల జాబితాలో చేరిపోయారు రాజమౌళి. బాహుబలి, ఆర్ఆర్ఆర్ తర్వాత బాలీవుడ్‌లో ఆయన గ్రాఫ్ అమాంతంగా పెరిగిపోయింది. ఇక క్రేజ్‌తో పాటు ఆయన ఆస్తుల విలువ కూడా భారీ స్థాయిలో పెరిగిందనే వార్తలు గుప్పుమంటున్నాయి. సినిమాలకు పారతోషికం మాత్రమే కాకుండా లాభాల్లో వాటా కూడా ఆయన తీసుకుంటాడని ఫిల్మ్ నగర్ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఫలితంగా హీరోల కంటే భారీ స్థాయిలో ఆయనకు ముడుతుందని తెలుస్తోంది.

ఇప్పటి వరకు రాజమౌళి పలు హిట్ చిత్రాలను అందించాడు. మొదటి నుంచి ప్లాఫ్ ఎరుగని దర్శకుడిగా కొనసాగుతున్నాయి. తొలినాళ్లలో పారతోషికం మాత్రమే ఆయన తీసుకునే వారని టాక్. అయితే ఆయన ఏ సినిమా తీసినా, బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లు దక్కుతాయి. అగ్రహీరోలతోనే కాకుండా సునీల్‌తో మర్యాద రామన్న, నానితో ఈగ సినిమాలు తీసి దర్శకుడిగా తన స్థాయి ఏంటో తెలియజెప్పారు. తనదైన మేకింగ్‌తో ప్రేక్షకులు తెర నుంచి చూపు తిప్పుకోనివ్వకుండా చేస్తారు. ఇటీవల వరకు ఆయన నికర ఆస్తుల విలువ రూ.150 కోట్లు అని తెలుస్తోంది.

ఇటీవల ఆయన దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ సినిమాకు లాభాల్లో 30 శాతం వాటా ఆయనకు దక్కిందని ప్రచారం సాగుతోంది. ఆ మొత్తం రూ.100 కోట్లు అని పలువురు చర్చించుకుంటున్నారు. దీంతో ఆయన ఆస్తుల విలువ ఏకంగా రూ.250 కోట్లకు చేరిందని తెలుస్తోంది. దర్శకుడు రాజమౌళికి భారీ స్థాయిలో సినిమా లాభాల్లో వాటా దక్కుతోంది. అయినప్పటికీ ఆయనతో సినిమా చేసేందుకు నిర్మాతలు ఉవ్వీళ్లూరుతుంటారు. ఆర్ఆర్ఆర్ సినిమా విషయానికొస్తే దాని నిర్మాణానికి రూ.450 కోట్లు ఖర్చు పెట్టారని తెలుస్తోంది. రాజమౌళిపై నమ్మకంతో ఎంతైనా పెట్టడానికి నిర్మాతలు ముందుకొస్తున్నారు.

భారీగా నిర్మాణవ్యయం అయినప్పటికీ, అంతకు మించి భారీ వసూళ్లు రాబట్టడం ఎలాగో బాగా తెలిసిన వ్యక్తి రాజమౌళి. అందుకే రాజమౌళి చెబితే ఎంత మొత్తమైనా ఖర్చు పెట్టడానికి నిర్మాతలు వెనుకాడడం లేదు. ఇక త్వరలో ఆయన మహేష్ బాబుతో సినిమా తీయనున్నారు. ఇప్పటి వరకు పాన్ ఇండియా సినిమాలు తీసిన రాజమౌళి త్వరలో పాన్ వరల్డ్ సినిమా తీయనున్నట్లు తెలుస్తోంది. దీంతో మహేష్ బాబు సినిమాకు రూ.800ల కోట్లు వెచ్చించనున్నట్లు ప్రచారం సాగుతోంది. దీంతో భారత సినీ వర్గాలు ఈ నిర్మాణ వ్యయం పెంపు చూసి నోరెళ్లబెడుతున్నారు.