రాజ‌కీయాల‌కు ఆ వైసీపీ యంగ్ ఎంపీ గుడ్ బై ?

ఏపీలో అధికార వైసీపీ నుంచి గత ఎన్నికల్లో ఏకంగా 22 మంది లోక్‌స‌భ సభ్యులు విజయం సాధించారు. జగన్ 25 మంది ఎంపీలను గెలిపిస్తే ప్రత్యేక హోదా దానంతట అదే వస్తుందని ఎన్నికల ప్రచారంలో చెప్పారు. గుంటూరు – విజయవాడ – శ్రీకాకుళం మినహా అన్ని లోక్‌స‌భ సీట్లలో వైసిపి ఎంపీలు విజయం సాధించారు. ఈ ఎంపీల్లో ఎక్కువమంది రాజకీయాలకు పూర్తిగా కొత్తగా ఉన్న వారితో పాటు యంగ్ ఉన్న వారే ఉన్నారు. రాజకీయాల్లో ఏమాత్రం అవగాహన లేని వారు కూడా జగన్ ప్రభంజనంలో లోక్‌స‌భ సభ్యులు అయిపోయారు. అయితే ఏపీలో ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఇటు రాష్ట్ర రాజకీయాల్లోనూ… అటు పార్లమెంట్ లోనూ తమ‌దైన‌ పాత్ర పోషించ లేకపోతున్నారు. చాలా మంది ఎంపీలు పార్లమెంటులో ప్రత్యేక హోదా లేదా పోలవరం ప్రాజెక్టు లేదా రైల్వేజోన్ గురించి ఒక్కమాట కూడా మాట్లాడలేని పరిస్థితి ఉంది.

అయితే కాస్తో కూస్తో వాయిస్ వినిపించే ఎంపీలకు సొంత పార్టీ నుంచి పోటీ మ‌ద్ద‌తు లేకపోవడం / స‌వాల‌క్ష కండీష‌న్లు పెట్ట‌డంతో వారు తీవ్ర నిరాశా నిస్పృహల్లోకి వెళ్లి పోతున్నారు. గుంటూరు జిల్లా నరసరావుపేట నుంచి గత ఎన్నికల్లో విజ్ఞాన్ విద్యాసంస్థల అధినేత లావు రత్తయ్య తనయుడు లావు శ్రీకృష్ణదేవరాయలు ఘనవిజయం సాధించారు. రాజకీయాలకు పూర్తిగా కొత్త అయిన శ్రీ కృష్ణ దేవరాయలు ప్రజాస్వామ్యంలో ఏదో సాధించాలని.. ఏదో చేయాలన్న ఆశలతో వచ్చారు. ఎంపీగా గెలిచిన ఈ మూడు సంవత్సరాలలో తన లోక్‌స‌భ నియోజకవర్గ పరిధిలో ప్రజలకు అందుబాటులో ఉండడంతో పాటు పలు అంశాలపై పార్లమెంటులో ఎప్పటికప్పుడు త‌న వాయిస్ వినిపిస్తూ వస్తున్నారు.

రాష్ట్ర సమస్యలతో పాటు తన నియోజకవర్గ పరిధిలో చిన్న చిన్న సమస్యలు గురించి ప్రస్తావించాలి అన్నా కూడా పార్టీ నేతల పర్మిషన్ తీసుకోవాల్సి రావడంతో పాటు లోక్‌స‌భ నియోజకవర్గ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలతో పొస‌గ‌క‌పోవడం… గత ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదా – పోలవరం లాంటి విషయాల్లో దూకుడుగా ఉన్న పార్టీ అధినేత జగన్ ఇప్పుడు సైలెంట్ గా ఉండటం… చివరకు గుంటూరులో తన ఆఫీసు ముందు కూడా రోడ్డు వేయించలేని దుస్థితిలో ఉండడంతో శ్రీకృష్ణదేవరాయలు తనకు అసలు ఈ ఎంపీ పదవి ఎందుకని ? నిట్టూరుస్తూ ఉన్నట్టు వైసిపి వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

దీనికి తోడు తన లోక్‌స‌భ నియోజకవర్గ పరిధిలో ఉన్న చిలకలూరిపేట ఎమ్మెల్యే విడ‌దల రజిని – సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు – వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుతో లావుకు ఏమాత్రం సఖ్యత లేదు. విడ‌దల రజిని ముందు నుంచి తన నియోజకవర్గంలో ఎంపీ పర్యటించాలంటే తనకు చెప్పి మాత్రమే రావాలని కండిషన్ లు పెడుతున్నారు. లావు సొంత‌ సామాజిక వర్గానికి చెందిన వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుతోనూ ఆయనకు సఖ్యత లేదు.

ఇక సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు సైతం తన అనుమతి లేనిదే తన నియోజకవర్గం లోకి రావొద్దని ఎంపీకి కండీషన్ పెట్టినట్లు ప్రచారం జరుగుతుంది. ఈ పరిణామాల నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకుండా రాజకీయాలకు దూరంగా ఉండాలని లావు సంచ‌ల‌న‌ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.