ఈ రెడ్డి ఎమ్మెల్యేల‌కు జ‌గ‌న్ మార్క్ షాకులు రెడీ…!

గత ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన వెంటనే మంత్రివర్గాన్ని ఏర్పాటు చేస్తున్నప్పుడు జగన్ ఈ మంత్రులు అందరూ రెండున్నర సంవత్సరాలు మాత్రమే మంత్రులు గా ఉంటారని… రెండున్నర సంవత్సరాల తర్వాత వీరిలో 90శాతం మందిని తొలగించి వారి స్థానంలో కొత్త వారికి అవకాశం ఇస్తానని ఓపెన్ గా ప్రకటించారు. జగన్ క్యాబినెట్ కొలువుదీరి ఇప్పటికే రెండున్నర సంవత్సరాలు దాటేసింది. మే చివరినాటికి మూడు సంవత్సరాలు పూర్తవుతుంది. వాస్తవంగా గత ఏడాది దసరాకి జగన్ కేబినెట్ మారుస్తారని ప్రచారం జరిగింది. అయితే రెండు సార్లు కోవిడ్ రావడంతో మంత్రులు ఏడాదిన్నర కాలంగా ఇళ్లకే పరిమితం అయిపోయారు.

దీంతో వారిని మరికొంత కాలం కొనసాగించాలని ఉద్దేశంతోనే జగన్ క్యాబినెట్ ప్ర‌క్షాళ‌న‌ వాయిదా వేసినట్టు తెలుస్తోంది. జగన్ క్యాబినెట్ లో మంత్రి పదవి కోసం మిగిలిన వారి సంగతి ఎలా ఉన్నా ఆయన సొంత సామాజిక వర్గం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు చాలా మంది ఆశలు పెట్టుకున్నారు. రాయలసీమతో పాటు నెల్లూరు – ప్రకాశం జిల్లాల్లో సీనియర్ రెడ్డి ఎమ్మెల్యేలు తమకు మంత్రి పదవి వస్తుందా రాదా ? అన్న టెన్షన్ తో ఉన్నారు.

ఇక గుంటూరు జిల్లా నుంచి గత ఎన్నికల్లో నలుగురు రెడ్డి ఎమ్మెల్యేలు విజయం సాధించారు. వీరిలో ముగ్గురు సీనియర్లు. మాచర్ల ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి – మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి – నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఈ ముగ్గురు కూడా 2014 ఎన్నికలలో కూడా విజయం సాధించారు. ఇక ఈ ముగ్గురికి తోడు గత ఎన్నికల్లో గుర‌జాల నుంచి గెలిచిన కాసు మహేష్ రెడ్డి తోడయ్యారు. మాచర్ల నుంచి గెలిచిన రామకృష్ణారెడ్డి నాలుగోసారి ఎమ్మెల్యేగా ఉన్నారు. పైగా ఆయన వైసీపీ నుంచే వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన తనకు కచ్చితంగా మంత్రి పదవి వస్తుందని ఆశతో ఉన్నారు.

ఇక నరసరావుపేట లో గెలిచిన గోపిరెడ్డి కూడా పార్టీ సీనియర్ నేత కావడంతో పాటు టీడీపీ కంచుకోటలో వరుసగా రెండుసార్లు విజయం సాధించడంతో తనకు మంత్రి పదవి వస్తుందని ఆశతో ఉన్నారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి నారా లోకేష్ ను నువ్వు ఓడిస్తే మంత్రి పదవి ఇస్తానని జగన్ స్వయంగా హామీ ఇచ్చారు. జగన్ కోరుకున్నట్టే మంగళగిరి ప్రజలు రామకృష్ణా రెడ్డిని గెలిపించి లోకేష్ ను ఓడించారు. మరి ఇప్పుడు ఆయనకు జగన్ మంత్రి పదవి ఇస్తారా ? ఇవ్వరా అన్నది సస్పెన్స్ గా ఉంది. ఈ ముగ్గురు రెడ్డి నేతల ఆశలు ఎలా ? ఉన్నా సామాజిక సమీకరణ‌ల పరంగా గుంటూరు జిల్లా నుంచి రెడ్డి ఎమ్మెల్యేల‌కు మంత్రి పదవి వచ్చే అవకాశాలు లేవు. ప్రకాశం – నెల్లూరు – అనంతపురం – కడప – కర్నూలు – చిత్తూరు జిల్లాల నుంచే రెడ్డి ఎమ్మెల్యేలకు ఈ సారి మంత్రి పదవి వచ్చే అవకాశాలు ఉన్నాయి.