కాంగ్రెస్‌తో పొత్తు.. లైన్ క్లీయ‌ర్ చేసుకుంటోన్న కేసీఆర్‌…!

తెలంగాణ రాజకీయాలు గత నాలుగు నెలలుగా హాట్ హాట్ గా మారిపోయాయి. ఇటు గల్లీ నుంచి ఢిల్లీ వరకు తెలంగాణ రాజకీయాల గురించి ఇప్పుడు ప్రధానంగా చర్చ నడుస్తోంది. తాజాగా సీఎం కేసీఆర్ మరోసారి బీజేపీని టార్గెట్గా చేసుకొని తీవ్రమైన విమర్శలు చేశారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై అసోం సీఎం చేసిన వ్యాఖ్యలపై కెసిఆర్ తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేయడంతో పాటు వెంటనే అస్సాం సిఎంను బర్తరఫ్ చేయాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు…. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ న‌డ్డాను డిమాండ్ చేశారు. కేసీఆర్ చేసిన ఈ కామెంట్ చూస్తే ఆయన జాతీయ రాజకీయాల్లో మళ్ళీ కాంగ్రెస్ దగ్గరవుతున్నారు అన్న చర్చ కూడా మొదలయింది.

తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఈ ప్రచారం జోరుగా సాగుతున్న నేపథ్యంలో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా ఘాటుగా స్పందించారు. కెసిఆర్ కాంగ్రెస్ కు దగ్గర అవుతున్నారన్న ఊహాగానాలపై తెలంగాణ పీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. కాంగ్రెస్ ఎప్పటికీ కూడా సీఎం కేసీఆర్ ను నమ్మే అవకాశమే లేదన్నారు. కేసీఆర్‌ను కాంగ్రెస్ రెండు సార్లు నమ్మి మోసపోయింద‌ని… మరోసారి మళ్లీ నమ్మి మోసపోవడం తాము సిద్ధంగా లేనని చెప్పారు. మోసగాడికి కేసీఆర్ బ్రాండ్ అంబాసిడర్ అంటూ రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.

తాము బీజేపీతో పాటు టీఆర్ఎస్ కు సమాన దూరంలో ఉన్నామని… మా ఇంటి కాకి… కేసీఆర్ ఇంటి మీద వాలదు… అలా వాలింది అంటే కాల్చి పడేస్తా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే బిజెపి – టిఆర్ఎస్ పార్టీ లను తరిమికొట్టాలని… ఈ రెండు పార్టీలు తెలంగాణ సమాజాన్ని మభ్య పెట్టాలని చూస్తున్నాయని ఆరోపించారు. కేంద్రంలో అవినీతి బయట పెడతా అంటే ఎవరు వద్దు అన్నారు అని కేసీఆర్ ను ప్రశ్నించారు. రాఫెల్ మీద కాంగ్రెస్ పార్టీ మాట్లాడినప్పుడు.. కేసీఆర్ ఎందుకు మాట్లాడలేదని నిలదీసిన రేవంత్ వారిద్దరూ ఒకరికి ఒకరు తోడుదొంగలు అని ఆరోపించారు.