నాగ‌బాబు సెటైర్లు చిరంజీవికేనా…!

ప‌వ‌న్‌క‌ళ్యాణ్ న‌టించిన భీమ్లానాయ‌క్ ఈ శుక్ర‌వారం రిలీజ్ అవ్వ‌డంతో పాటు ఏపీలో తీవ్ర రాజ‌కీయ దుమారానికి కార‌ణ‌మైంది. ఏపీలో ప్ర‌భుత్వ యంత్రాంగం ఈ సినిమా ఆడుతోన్న థియేట‌ర్ల వ‌ద్ద రెవెన్యూ, పోలీసు అధికారుల‌తో పాటు ఇత‌ర యంత్రాంగాన్ని మోహ‌రించి మ‌రీ సోదాలు, త‌నిఖీలు చేయ‌డం పెద్ద చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఏదేమైనా సినిమా వ‌సూళ్లు కాస్త త‌గ్గాయే త‌ప్పా.. సినిమా హిట్ అయ్యింది. మంచి వ‌సూళ్లు రాబ‌డుతోంది.

ఇక ప‌వ‌న్ అభిమానులు ఏపీలో ఎక్క‌డిక‌క్క‌డ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా నిర‌స‌న‌లు హోరెత్తించారు. కొంద‌రు హైద‌రాబాద్‌తో పాటు తెలంగాణ వెళ్లి మ‌రీ సినిమా చూసి వ‌చ్చారు. ఇక విజ‌య‌వాడ లాంటి చోట్ల తెలంగాణ సీఎం కేసీఆర్‌కు, కేటీఆర్‌కు హ్యాట్సాప్ చెపుతూ బ్యాన‌ర్లు వేశారు ప‌వ‌న్ అభిమానులు. దీనిపై వైసీపీ మంత్రులు, నాయ‌కుల నుంచి కౌంట‌ర్లు వ‌చ్చాయి.

అయితే ప‌వ‌న్ సినిమాను ఇంత టార్గెట్ చేస్తున్నా ఇండ‌స్ట్రీలో పెద్ద‌లు ఎవ్వ‌రూ స్పందించ‌లేదు.. ఈ సంఘ‌ట‌న‌ను ఖండించ‌నూ లేదు. దీనిపై మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు ఓ వీడియోలో త‌న తీవ్ర అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. ప‌వ‌న్‌పై ఏపీ ప్ర‌భుత్వం ప‌గ‌బ‌ట్టి ఇంత అన్యాయం చేస్తుంటే ప‌రిశ్ర‌మ నుంచి పెద్ద‌వాళ్లెవ‌రూ ఒక్క మాట కూడా మాట్లాడ‌క‌పోవ‌డం దుర‌దృష్ట‌క‌ర‌మ‌న్నారు. ఇంత మంది హీరోలు ఉన్నా.. సాటి హీరోకు జ‌రుగుతున్న అన్యాయంపై ఎవ్వ‌రూ స్పందించ‌లేద‌ని ఆయ‌న వాపోయారు.

అయితే ఈ వ్యాఖ్య‌లు నాగ‌బాబు త‌న అన్న చిరంజీవిని కూడా టార్గెట్ గా చేసుకుని మాట్లాడారా ? అన్న సందేహాలు కొంద‌రు వ్య‌క్తం చేస్తున్నారు. చిరంజీవి ఇటీవ‌ల చొర‌వ తీసుకుని జ‌గ‌న్‌తో చ‌ర్చ‌లు జ‌రిపారు. ఇప్పుడు నాగ‌బాబు చిరంజీవి కూడా ఈ విషయంపై సైలెంట్‌గా ఉండ‌డంతో అస‌హ‌నంతో ఉన్నార‌ని టాక్ ? ఆ మాట‌కు వ‌స్తే మెగా ఫ్యామిలీలోనే చాలా మంది హీరోలు, నిర్మాత‌లు ఉన్నారు.మ‌రి వారు ఎందుకు ? స్పందించ‌లేదో నాగ‌బాబు ఆన్స‌ర్ ఇస్తే బాగుండేది..!