ఈ టైంలో సంబరాలేంది సామీ..

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వంలో, పార్టీలో నెంబర్ 2 అయిన కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదమవుతున్నాయి. స్వయంగా ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఆయన ఎందుకిలా మాట్లాడుతున్నాడో అధికారులకు అంతుచిక్కడం లేదు. ఆయన అలా చేయడం తప్పని చెప్పే వాళ్లు కూడా లేకపోవడంతో ఆయన నోటి వెంట అలా మాటలు వచ్చేస్తున్నాయి. దీంతో పార్టీ కార్యకర్తలు ఆ ఆదేశాలను తూచా తప్పకుండా అమలు చేస్తున్నారు. ఇంతకీ విషయమేంటంటే.. రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి.

దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. జనవరి 10 వరకు ఎటువంటి బహిరంగ సభలు, ర్యాలీలు, మతపరమైన కార్యక్రమాలు చేయరాదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ స్పష్టంగా ఆదేశాలు జారీ చేశారు. అయితే కేటీఆర్ నల్లగొండలో జరిగిన ఐటీ హబ్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని భారీ బహిరంగ సభలో మాట్లాడారు. అంతకుముందు నాయకులు, కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించారు. అంతేనా.. కేటీఆర్ కు స్వాగతం చెప్పేందుకు అనేకమంది గుంపులుగా వెళ్లారు. దీనినే టీపీసీసీ చీఫ్ పాయింట్ అవుట్ చేశాడు. కేటీఆర్ పై కేసు నమోదు చేయాలని డీజీపీని డిమాండ్ చేశారు. అయితే ప్రభుత్వం నుంచి నో రెస్పాన్స్.

ఆయనకు వర్తించని నిబంధనలు ప్రతిపక్ష పార్టీలకెందుకు అమలు చేస్తారని ప్రశ్నించారు. ఇదిలా ఉంటే రైతుబంధు పథకంపై మంత్రిగారిచ్చిన పిలుపు కూడా చర్చనీయాంశమైంది. జనవరి 10వ తేదీ వరకు సంబరాలు చేయాలని, ఎడ్లబండ్లు, ట్రాక్టర్ల ఊరేగింపు చేయాలని పిలుపునిచ్చారు. ఓరి దేవుడో.. కోవిడ్ నిబంధనలున్నాయి.. అటువంటివి వద్దు స్వామీ అని చెప్పే వారే పార్టీలో కానీ, ప్రభుత్వంలో కానీ లేకపోయారు. కనీసం ఆయనకైనా తెలియదా అని మేథావులు ప్రశ్నిస్తున్నారు. మరి కేటీఆర్ ఇలా ఎందుకు మాట్లాడుతున్నాడో… ఈ టైంలో సంబరాలు ఎలా చేసుకుంటాం సామీ.. కాస్త ఆలోచించండి.

Share post:

Latest