వామ్మో.. హన్సిక సింగిల్ దెబ్బ మామూలుగా లేదుగా!

దేశముదురు చిత్రంతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన బొద్దుగుమ్మ హన్సికా మోత్వాని, ఆ తరువాత స్టార్ హీరోయిన్‌గా తన సత్తా చాటుకుంది. అయితే తెలుగులో కంటే కూడా అమ్మడికి తమిళంలో అదిరిపోయే ఫేం రావడంతో, అక్కడే ఎక్కువ సినిమాలు చేసింది. దీంతో నేరుగా తెలుగు సినిమాలో నటించి చాలా రోజులు అవుతుంది. అయితే ఈ బ్యూటీ తాజాగా ఓ ప్రయోగాత్మక చిత్రంలో నటిస్తుండటంతో ఇప్పుడు మరోసారి అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తోంది.

సింగిల్ షాట్‌లో రాబోయే సినిమాగా ‘105 మినట్స్’ అనే సినిమాలో హన్సికా లీడ్ రోల్‌లో నటించబోతోంది. ఈ సినిమాను ఏకంగా 105 నిమిషాల పాటు సింగిల్ షాట్‌లో తెరకెక్కించడం విశేషం. అయితే ఇక్కడ మరో విశేషమేమిటంటే.. ఈ సినిమాలో హన్సికా సింగిల్ క్యారెక్టర్ మాత్రమే ఉంటుంది. ఇలాంటి ప్రయోగాత్మక చిత్రానికి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్‌ను చిత్ర యూనిట్ తాజాగా రిలీజ్ చేశారు. సింగిల్ షాట్ చిత్రాలు ఎక్కువగా హాలీవుడ్‌లో వస్తాయని, ఇలాంటి ప్రయోగాలను మన తెలుగు సినిమాల్లో జరగడం లేదని తాను బాధపడేవాడినని ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ అన్నారు. 105 మినట్స్‌కు సంబంధించిన గ్లింప్స్ వీడియోను ఆయన రిలీజ్ చేశారు.

ఇలాంటి ప్రయోగాత్మక చిత్రాలకు ఆదరణ ఖచ్చితంగా ఉంటుందని, ఈ సినిమా ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇక ఈ సినిమాలో హన్సికా పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను థ్రిల్ చేయడం ఖాయమని చిత్ర యూనిట్ అంటోంది. ఈ సినిమాను దర్శకుడు రాజు దుస్సా డైరెక్ట్ చేయగా, రుధ్రాన్ష్ సెల్యూలాయిడ్ పతాకంపై బొమ్మక్ శివ నిర్మించారు. సామ్ సి.యస్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.

Share post:

Latest