బాధ్యత మోదీది అయినా.. ఎఫెక్ట్ కేసీఆర్ పైనే..

తెలంగాణలో ఈరోజు (సోమవారం) రైతులు అత్యంత ఆసక్తిగా సీఎం కేసీఆర్ వైపు చూస్తున్నారు. సాయంత్రం దాదాపు రాష్ట్రం మొత్తం టీవీల ముందు కూర్చుంటుంది. ఎందుకంటే వరి కొనుగోలు వ్యవహారంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వార్ నడుస్తోంది. వరి కొనుగోలు చేయాలని కేసీఆర్..మేము కొనం అని కేంద్రం అంటోంది. ఇందిరా పార్కు వద్ద ధర్నా చేసి ఢిల్లీకి వెళ్లొచ్చిన కేసీఆర్ ఇంతవరకు వరి సమస్యపై నోరు విప్పలేదు. సోమవారం ప్రగతి భవన్ లో ప్రత్యేకంగా కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. సమావేశంలో కూలంకుషంగా సమస్యను చర్చిస్తారు. కేంద్రం వరిని కొనుగోలు చేసే పరిస్థితి లేదు..అలాగని రాష్ట్రం అలాగే వదిలేయలేదు.

ఎందుకంటే ఈ ప్రభావం ఎక్కువగా చూపేది కేసీఆర్ ప్రభుత్వంపైనే. వరి కొనుగోలు బాధ్యత మొత్తం కేంద్రానిదే అని టీఆర్ఎస్ చెబుతున్నా.. మోదీ పట్టించుకోవడం లేదు. అలాగే వదిలేస్తే రైతులు మోదీకి వ్యతిరేకం కావడం అటుంచితే కేసీఆర్ పార్టీపై దాని ప్రభావం పడుతుంది. ఎందుకంటే ఎవ్వరైనా కేసీఆర్ పట్టించుకోలేదు అంటారు గానీ.. మోదీని అనరు. అయినా.. ఇప్పటికిప్పుడే బీజేపీకి వచ్చే ప్రయోజనాలూ లేవు.

కేసీఆర్ పట్టించుకోకపోతే బీజేపీ దానిని ఓన్ చేసుకొని అప్పుడు స్టాండ్ తీసుకుంటుంది. అందుకే టీబీజేపీ నాయకులు కూడా వేచి చూసే ధోరణి అవలంబిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేబినెట్ తీసుకునే నిర్ణయాలపైనే సర్వత్రా ఆసక్తి నెలకొంది. అన్ని రాజకీయ పార్టీలు కేసీఆర్ మీడియా సమావేశం కోసం ఎదురుచూస్తున్నాయి. ఆయన ఏం మాట్లాడతాడు.. ఏం నిర్ణయం తీసుకుంటాడో అని.. టీఆర్ఎస్ చీఫ్ తీసుకునే నిర్ణయంపైనే ప్రతిపక్ష పార్టీల ఎత్తుగడ ఉంటుంది. ఎందుకంటే రైతుల కంటే వారికి ముఖ్యం రాజకీయమే కదా..