వైరల్: మత విశ్వాసాన్ని పక్కనపెట్టి ప్రాణాలకు తెగించి ఇద్దరి ప్రాణాలు కాపాడిన సిక్కులు..!

మామూలుగా ఎవరైనా ప్రాణాపాయ స్థితిలో ఉంటే వారిని రక్షించాలని సాటి మనిషిగా దాదాపు అందరూ అనుకుంటారు. కానీ తమకు ఏదైనా నష్టం జరుగుతుందంటే మాత్రం చాలామంది సంకోచిస్తారు. అయితే తాజాగా సిక్కు మతస్థులు మాత్రం ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఇద్దరిని కాపాడడానికి తమ మత విశ్వాసాలను సైతం పక్కనపెట్టారు. ఈ సిక్కు సోదరులు తమ ప్రాణాలకు తెగించి మరీ ఇద్దరు వ్యక్తులను మృత్యుఒడి నుంచి బయటపడేశారు. సకాలంలో సరిగ్గా స్పందించి జలపాతంలో చిక్కుకున్న ఇద్దరు మనుషులను సమయస్ఫూర్తితో సంరక్షించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

వివరాల్లోకి వెళితే.. కెనడాలోని బ్రిటీష్ కొలంబియాలోని గోల్డన్ ఇయర్స్ ప్రోవిన్షియల్ పార్క్ కు కుల్జీందర్ కిండా తన నలుగురు స్నేహితులతో కలిసి పర్వతాధిరోహణకు వెళ్లారు. అదే సమయంలో ఇద్దరు వ్యక్తులు రాతిపై నడుస్తూ కాలుజారి జలపాతంలో పడిపోయారు. ఈ ఘటన చూడగానే సిక్కు సోదరులు కుల్జీంచర్ కిండా, అతని స్నేహితులు కాపాడడానికి ముందుకు వచ్చారు. కానీ జలపాతంలో చిక్కుకున్నవారిని ఎలా కాపాడాలో అర్థం కాలేదు. ఏదైనా తాడు అందిస్తే తప్ప వారిని జలపాతం నుంచి పైకి తీసుకు రావడం అసాధ్యంగా మారింది. ఆలస్యం చేస్తే జలపాతం ఉధృతి మరింత పెరిగి ఇద్దరూ నీటిలో కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. దీనితో సిక్కు సోదరులు తమ మత విశ్వాసాలను పక్కన పెట్టాలని నిర్ణయించుకున్నారు. వారు తమ తలపాగాను తాడులా మార్చి ఇద్దరిని పైకి లాగి కాపాడారు. దాదాపు చాలా సేపు కష్టపడి ఆ ఇద్దరు వ్యక్తులను క్షేమంగా ప్రాణాలతో పైకి తీసుకొచ్చారు.

సిక్కు సోదరులు తమ తలపాగాను తాడుగా మార్చి జలపాతంలో చిక్కుకున్న వారిని రక్షించిన వీడియో వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజన్లు హ్యాట్సాఫ్ అంటూ వారిపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. సిక్కులు చేసిన సాహసానికి స్థానిక మీడియా కూడా ప్రశంసించింది.