ఆగస్టు 22 నా పుట్టినరోజు అయితే.. సెప్టెంబర్ 22 నటుడిగా నా పుట్టినరోజు.. మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్..!

మెగాస్టార్ చిరంజీవి సినీ ఇండస్ట్రీకి వచ్చి 43 సంవత్సరాలు పూర్తయింది. 1978 సెప్టెంబర్ 22న చిరంజీవి నటించిన తొలి సినిమా ప్రాణం ఖరీదు సినిమా విడుదలైంది. ఈ సినిమాకంటే ముందే చిరంజీవి నటించిన పునాది రాళ్లు సినిమా ప్రారంభమైనప్పటికీ..ప్రాణం ఖరీదు ముందుగా విడుదల అయ్యింది. దీంతో ఈ సినిమానే చిరంజీవి మొదటి సినిమాగా నిలిచింది.

ఖైదీ సినిమాతో స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న చిరంజీవి రెండు దశాబ్దాలకు పైగా నెంబర్ వన్ స్థానంలో కొనసాగాడు. ఇప్పటివరకు చిరంజీవి 151 సినిమాల్లో నటించాడు. ఆచార్య మూవీ 152 రెండవది. చిరంజీవి 153 వ సినిమాగా గాడ్ ఫాదర్, 154 వ సినిమాగా భోళా శంకర్ తెరకెక్కనున్నాయి. చిరంజీవి 2006లో భారత ప్రభుత్వం నుంచి పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. 2012 -14 మధ్య కాలంలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా పదవి నిర్వహించారు.

కాగా సినిమాల్లోకి వచ్చి 43 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా చిరంజీవి ఒక ఎమోషనల్ ట్వీట్ చేశాడు. ‘ఆగస్టు 22 నేను పుట్టిన రోజు అయితే, సెప్టెంబర్ 22 నటుడిగా నేను పుట్టిన రోజు. కళామతల్లి నన్ను అక్కున చేర్చుకున్న రోజు. మీ అందరికీ నన్ను నటుడిగా పరిచయం చేసి మీ ఆశీస్సులు పొందిన రోజు. నేను మర్చిపోలేని రోజు.’ అని మెగాస్టార్ భావోద్వేగ ట్వీట్ చేశాడు. సినీ ఇండస్ట్రీలో 43 సంవత్సరాల కెరీర్ పూర్తిచేసిన చిరంజీవికి సినీ పరిశ్రమకు చెందిన పలువురు శుభాకాంక్షలు తెలిపారు.