అన్నం తినలేదని చిన్నారిని నేలకేసి విసిరిన తండ్రి.. అది చూసి పక్కున నవ్విన తల్లి..మెదక్ లో అమానుషం..!

నాలుగేళ్ళ పాప అన్నం తినకుండా మారం చేస్తోందని.. కన్నతండ్రి రాక్షసుడిలా మారాడు. ఒక పొడవాటి తాడు తీసుకొని చితకబాదాడు. అంతటితో ఆగకుండా చిన్నారిని ఒక చేత్తో గాల్లోకి లేపి నేలపైకి కొట్టాడు. ఆ సమయంలో పక్కనే ఉన్న తల్లి తండ్రికి సర్ది చెప్పాల్సింది పోయి నవ్వుతూ ఉండడం కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళసలు తల్లిదండ్రులేనా.. మానవత్వం లేదా అని మండిపడుతున్నారు.

మెదక్ మున్సిపాలిటీలో నాగరాజు అనే వ్యక్తి ట్రాక్టర్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. ఇతనికి నాలుగేళ్ల పాప గగన శ్రీ ఉంది. రోజు మద్యం తాగి ఇంటికి వచ్చే నాగరాజు.. షరా మామూలుగానే మత్తులో ఇంటికి చేరుకున్నాడు. ఆ సమయానికి ఇంట్లో తల్లి చిన్నారికి అన్నం తినిపించే ప్రయత్నంలో ఉంది. తల్లి ఎంత చెప్పినా అన్నం తినకుండా గగన శ్రీ మారం చేస్తుండటాన్ని తండ్రి గమనించాడు. ఉన్నట్టుండి ఒక పొడవాటి తాడు తీసుకొని చిన్న పాప అనే కనికరం లేకుండా చితకబాదాడు.

అప్పటికి కూడా అతడి కోపం చల్లారలేదు. చిన్నారిని ఒక చేత్తో గాలిలోకి పైకి లేపుతూ నేలపైకి కొట్టాడు. చిన్నారిని తండ్రి చితక బాదు తుండగా పక్కనే ఉన్న తల్లి మాత్రం నవ్వుతూ కనిపించింది. అయితే ఈమె చిన్నారికి సవతి తల్లి అని తెలిసింది. ఈ దారుణం చూసి చుట్టుపక్కల వాళ్ళు సెల్ ఫోన్లో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోను చూసిన వారు నాగరాజు, ఆమె సవతి తల్లి ప్రవర్తనపై మండి పడ్డారు. తండ్రి చితకబాదు తుండగా ఆపాల్సింది పోయి నవ్వుతూ కనిపించిన తల్లిని అందరూ తెగ తిడుతున్నారు. నువ్వసలు తల్లివేనా.. అని కామెంట్స్ చేస్తున్నారు.

చిన్నారి పట్ల అమానుషంగా ప్రవర్తించిన తల్లిదండ్రుల పై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ఈ విషయం పోలీసుల వరకు వెళ్లడంతో వారు చిన్నారి తల్లి దండ్రులను స్టేషన్ కు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. మరోసారి ఇలా జరిగితే చూస్తూ ఊరుకోమని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు.

Share post:

Popular