తెలంగాణకు యడ్యూరప్ప.. పుదుచ్చేరి లెఫ్టినెట్ గవర్నర్ గా తమిళి సై?

కర్ణాటక రాజకీయాలు దగ్గరనుంచీ గమనించే వాళ్లకు యడ్యూరప్ప పేరును పెద్దగా పరిచయం చేయనవసరం లేదు. కన్నడ రాజకీయాల్లో తలపండిన యడ్యూరప్ప మొన్న సీఎం పదవి నుంచి తప్పుకున్న తరువాత సైలెంట్ అయ్యారు. అయితే కమలం పెద్దలు మాత్రం యడ్యూరప్పను రాష్ట్రంలోనే ఉంచితే కష్టమని, సొంత సర్కారుకే చిక్కులు వస్తాయని భయపడుతున్నారు. అందుకే ఆయను ఏదైనా రాష్ట్రానికి గవర్నర్ గా పంపాలని ఆలోచిస్తోంది. అధిష్టానం ఆలోచనలు ఇలా ఉంటే.. తాను మాత్రం రాజ్ భవన్ కు వెళ్లబోనని, ఇక్కడే రాజకీయ నాయకుడిగా ఉంటానని స్పష్టం చేసినట్లు సమాచారం. అయిన సరే. . బీజేపీ అధిష్టానం యడ్డి అక్కడ ఉండకుండా ప్లాన్ రూపొందిస్తోంది. ఈ నేపథ్యంలో సరికొత్త విషయం తెరపైకి వచ్చింది. యడ్యూరప్పను తెలంగాణ గవర్నర్ గా పంపాలని కేంద్రం ఆలోచిస్తోందని సమాచారం.

ఎలాగైనా సరే ఆయనను ఒప్పించి పిలుచుకురావాలని కన్నడ నాయకులకు పార్టీ దిశానిర్దేశం చేసిందట. అంతటి యడ్యూరప్పను మేమేం ఒప్పిస్తామని కర్ణాటక కమలం నాయకులు తమలో తాము గుసగులాడుతున్నారట. మరి యడ్డిని తెలంగాణకు గవర్నర్ గా పంపితే తమిళి సై పరిస్థితేమిటని కొందరు ప్రశ్నించారు. అందుకే కేంద్రం దీనికి కూడా సమాధానం దగ్గరగా ఉంచుకుంది. యడ్డి తెలంగాణకు రావడానికి సిద్ధపడితే.. తమిళి సై సౌందర్ రాజన్ ను పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా నియమిస్తారు. ఆల్రెడీ పుదుచ్చేరికి తమిళి సై ఇంచార్జి లెఫ్టినెంట్ గవర్నర్ గా వ్యవహరిస్తున్నారు. ఇక్కడ గవర్నర్ పదవి కన్నా పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా చేయడానికి ఆమె ఆసక్తి చూపవచ్చని సమాచారం. ఎందుకంటే కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో లెఫ్టినెంట్ గవర్నర్ వే సర్వాధికారాలు.. ఇంకా చెప్పాలంటే అక్కడ అనధికార ముఖ్యమంత్రి అన్నమాట. ఇవన్నీ జరిగేది యడ్యూరప్ప ఒప్పుకుంటేనే అని కమలం వర్గాల్లో వదంతులు చక్కర్లు కొడుతున్నాయి. ఏం జరుగుతుందో చూడాలి మరి.

Share post:

Latest