టీఆర్ఎస్ నేతల్లో పెరుగుతున్న అసహనం.. అందుకు తుమ్మలే నిదర్శనం

తుమ్మల నాగేశ్వర్‌రావు.. ఇపుడు తెలంగాణలో హాట్‌ టాపిక్‌ అయ్యారు. ఖమ్మం జిల్లాలోని తన పాలేరు నియోజకవర్గంలో మూడేళ్లుగా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదని మాజీ మంత్రి, టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత తుమ్మల నాగేశ్వర్‌రావు బహిరంగంగానే వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది. ఆ నియోజకవర్గంలో అభివృద్ధి జరిగింది అంటే అది కేవలం తన హయాంలో మాత్రమేనని, అది కూడా మంత్రిగా ఉన్న కాలంలోనే ( 2018 డిసెంబర్‌) వరకు మాత్రమేనని పేర్కొన్నారు. ఆ తరువాత తుమ్మల పాలేరులో కాం‍గ్రెస్‌ అభ్యర్థి కందుల ఉపేందర్‌ రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆ తరువాత పార్టీలో కూడా పెద్దగా యాక్టివ్‌గా లేరు. గత అసెంబ్లీ ఎన్నికల అనంతరం కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచిన కందుల కూడా కారు ఎక్కారు. దీంతో నియోజకవర్గంలో కందుల హవానే నడిచింది.

అప్పటినుంచి తుమ్మలను పార్టీ చీఫ్‌తోపాటు, నియోజకవర్గం నాయకులు సైడ్‌ చేశారు. అప్పటినుంచీ తుమ్మల పార్టీలో అధిష్టానంపై గుర్రుగా ఉన్నారు. ఎమ్మెల్యేగా ఓడిపోయిన అనంతరం తుమ్మల ఎమ్మెల్సీపై భారీ ఆశలు పెట్టుకున్నారు. పలువురు పార్టీ నాయకులతో లాబీయింగ్‌ నడిపారు. అయినా కేసీఆర్‌ ఈయనవైపు మొగ్గుచూపలేదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన కౌషిక్‌రెడ్డికి గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని కేబినెట్‌ నిర్ణయించడంతో తుమ్మల పుండుపై కారం చల్లినట్లయింది. కేసీఆర్‌ తీసుకున్న ఈ నిర్ణయాన్ని తుమ్మల తట్టుకోలేకపోయాడు. అందుకే అభివృద్ధిపై బహిరంగ విమర్శలు మొదలుపెట్టాడు. అంతకుముందు పార్టీ సీనియర్‌ నాయకుడు కడియం శ్రీహరి కూడా దళిత బంధుపై మాట్లాడి వార్తల్లో నిలిచారు. దళితులకు మూడెకరాల భూమి పథకంలాగా దళితబంధు పథకం కూడా ఫ్లాప్‌ అయితే ఇక టీఆర్‌ఎస్‌ పరిస్థితి అగమ్యగోచరమే అని కడియం అభిప్రాయపడ్డారు. దీంతో పార్టీలో సీనియర్ల వాయిస్‌ లేస్తోందని పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఇది ఇలాగే కంటిన్యూ అయితే కష్టమే అని పరిశీలకులు భావిస్తున్నారు.