ప్రజా సేవలో జక్కంపూడి రామ్మోహన రావు ఫౌండేషన్

జక్కంపూడి కుటుంబం మొదటి నుంచి వైఎస్‌కు అత్యంత నమ్మకంగా ఉంది. రాజా తండ్రి రామ్మోహన్ వైఎస్‌కు సన్నిహితంగా మెలిగారు. తూర్పుగోదావరి జిల్లాలో కీలక నేతగా ఉన్నారు. అయితే రాజాకు మంత్రివర్గంలో ఛాన్స్ ఇస్తారనే ప్రచారం జరిగింది. సామాజిక సమీకరణాలు, సీనియార్టీతో అవకాశం దక్కలేదు.

కానీ ఇప్పుడు కాపు కార్పొరేషన్ ఛైర్మన్ పదవిలో జక్కంపూడి రాజా కొనసాగుతున్నారు. ఇదిలా ఉండగా జక్కం పూడి ఫౌండేషన్ తరపున ఆయన అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. జక్కంపూడి రామ్మోహన రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో జీవధార ఆక్సిజన్ వెయిటింగ్ హాల్ ఏర్పాటు చేశారు.

ఒక్కరికి కూడా ఊపిరి ఆగిపోకూడదనే లక్ష్యంతో జీవధార ఆక్సిజన్ వెయిటింగ్ హాల్స్ ను జక్కంపూడి రాజా ఏర్పాటు చేశారు. విపత్తు పరిస్థితుల్లో ఆసుపత్రిలలో బెడ్లు కంటే కోవిడ్ రోగుల సంఖ్య ఎక్కువ గా ఉంది. ఈ నేపథ్యంలో శ్రీ జక్కంపూడి రామోహన రావు ఫౌండేషన్ ద్వారా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీజేసీ సభ్యురాలు జక్కంపూడి విజయ లక్ష్మీ గారి సూచనల మేరకు కరోనా బారిన పడి రోగులు కోలుకునే వరకు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జక్కంపూడి రాజా తెలిపారు.

ఇప్పటికే తమ్ముడు జక్కంపూడి గణేష్ సంజీవిని రధాలు ద్వారా కరోనా బారిన పడిన బాధితులను ఉచితంగా ఇంటి నుంచి ఆసుపత్రికి తరలిస్తున్నమని అన్నారు. కైవల్య రధాలను ఏర్పాటు చేసి కరోనా తో మృతి చెందిన మృతదేహాలను ఉచితంగా ఆసుపత్రి నుంచి స్మశానవాటికకు తరలించే ఏర్పాట్లు చేశారని అన్నారు.

కరోనా రోగులకు విరాట్ అమృత ఔషధి మందులను ఉచితంగా అందిస్తున్నామని అన్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో కరోనా రోగులకు సమయానికి బెడ్స్ అందుబాటులో లేక మృత్యువాత పడుతున్నారని అన్నారు. దీనిని అరికట్టేందుకు జక్కంపూడి ఫౌండేషన్ ద్వారా జీవధార ఆక్సిజన్ వెయిటింగ్ హాల్స్ ఏర్పాటు చేశామన్నారు. ఈ ఆక్సిజన్ వెటింగ్ హళ్ళలో ఆసుపత్రిలో బెడ్స్ దొరికేవరకు ప్రాధమిక చికిత్స అందిస్తారని తెలిపారు. ఆసుపత్రిలో బెడ్స్ అందుబాటులో వచ్చిన వెంటనే రోగులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించేదుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. జీవధార ఆక్సిజన్ వెయిటింగ్ హాళ్ళు ఏర్పాటు చేయడానికి సహకరించిన సర్ ఆర్దర్ కాటన్ నర్సరీ ఫార్మర్స్ అసోసియేషన్ కార్యవర్గాన్ని అభినందించారు.