భార‌త్‌కు విమాన స‌ర్వీసుల‌పై న్యూజిలాండ్ కీల‌క నిర్ణ‌యం..!

భార‌త్‌లో కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఉధృతి అంతకంతకు పెరుగుతూ వస్తున్నది. ఒక్క రోజే లక్ష కేసులను దాటడమే కాదు.. తాజాగా 1.26 లక్షల కేసులు కొత్తగా నమోదవ‌డం ఆందోళ‌న‌ను రేకేత్తిస్తున్న‌ది. కరోనా మనదేశంలోకి ప్రవేశించినప్పటి నుంచి ఇవే అత్యధిక కేసులు కావడం గ‌మ‌నార్హం. దేశవ్యాప్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తంగా 1,29,28,574 కేసులు న‌మోదుకాగా, ప్రపంచంలో అమెరికా, బ్రెజిల్ తర్వాత అత్యధిక కేసుల జాబితాలో మన దేశం మూడో స్థానంలో నిల‌వ‌డం శోచ‌నీయం. యాక్టివ్ కేసులు మళ్లీ తొమ్మిది లక్షలను దాటాయి. దేశంలో ప్రస్తుతం 9,10,319 క్రియాశీలక కేసులున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం ఉదయం వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 685 మంది కరోనాతో మరణించారని తెల‌ప‌గా, మొత్తం మరణాల సంఖ్య 1,66,862కు చేరింది.

ఈ నేపథ్యంలోనే మనదేశం నుంచి సాగే విమాన రాకపోకలపై ప్ర‌పంచ దేశాలు దృష్టి సారించాయి. భార‌త్ అంటేనే జంకుతున్నాయి. తాజాగా న్యూజిలాండ్ ప్రభుత్వం తాత్కాలిక నిషేధం విధించింది. కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో న్యూజిలాండ్ ప్రధాని జెసిండా అడర్న్ ఈ నిర్ణయం తీసుకున్నారు. భారత్‌ నుంచి న్యూజిలాండ్‌కు వెళ్లాలనుకునే ఆ దేశ వాసులకూ ఈ నిబంధన వర్తిస్తుందని వివరించ‌డం గ‌మ‌నార్హం. ఈ నెల 11 నుంచి 28వ తేదీ వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుందని, ఈ లోగా సురక్షితంగా రాకపోకలు నిర్వహించడానికి మార్గాలను అన్వేషిస్తామని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. కరోనా కట్టడిలో గతేడాది న్యూజిలాండ్ ఆదర్శంగా నిలిచింది. ప్రస్తుతం అక్కడ వారానికి సగటున ఐదు కొత్త కేసులు మాత్ర‌మే నమోదవుతుండ‌డం గ‌మ‌నార్హం.

Share post:

Latest