భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్‌వీ రమణ నియామకం..!

భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ నూతలపాటి వెంకట రమణ నియమితులయ్యారు. తనకు లభించిన అధికారాలను ఉపయోగిస్తూ భారత రాష్ట్రపతి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు న్యాయవ్యవహారాల మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేస్తూ, నియామక పత్రాన్ని ప్రస్తుతం సుప్రీం కోర్టు జడ్జిగా ఉన్న ఎన్‌వీ రమణకు అందజేశారు. జస్టిస్ రమణ సుప్రీం కోర్టు 48వ చీఫ్ జస్టిస్‌గా ఏప్రిల్ 24న బాధ్యతలు చేపట్టనున్నారు. వ్యవసాయ కుటుంబంలో జన్మించిన జస్టిస్ రమణ మంచి అధ్యయనశీలి.

తెలుగు సాహిత్యాన్ని బాగా విస్తృతంగా చదివారు.1983 ఫిబ్రవరి 10న న్యాయవాదిగా ఆయన కెరీర్ మొదలు పెట్టారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న టైములో ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అదనపు అడ్వకేట్ జనరల్‌గా చేసారు. ఆ తరువాత 2000 జూన్ 27న ఏపీ హైకోర్టు పర్మినెంటు జడ్జిగా నియమితులయ్యారు. 2013 మార్చి 10 నుంచి మే 20 వరకూ ఏపీ హైకోర్టు యాక్టింగ్ ఛీఫ్ జస్టిస్‌గా చేసారు. 2013 సెప్టెంబరు 2న దిల్లీ హైకోర్టు ఛీఫ్ జస్టిస్‌గా పదోన్నతి పొంది, ఆ తరువాత 2014 ఫిబ్రవరి 17న సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా నియమితం అయ్యారు.