ప్రీ రిలీజ్ ‘బంగారం’ వెంకీ రికార్డు!

కొన్నేళ్లగా  సోలో హీరోగా విక్టరీ వెంకటేష్ ఇమేజ్ దెబ్బ తింది. కుర్ర హీరోల జోరు మధ్య ఆయన హవా తగ్గిపోయింది. వేరే హీరోలతో తెర పంచుకుంటూ సోలో హీరోగా వెనకబడిపోయాడు వెంకీ. ఆయన మార్కెట్ కూడా దెబ్బ తింది. దృశ్యం సినిమా బాగా ఆడినా సరే.. దానికి పెద్దగా బిజినెస్ జరగలేదు. లాభాలు కూడా భారీగా ఏమీ రాలేదు. ఐతే బాబు బంగారం సినిమాతో వెంకీ ఫామ్ అందుకున్నట్లే కనిపిస్తున్నాడు.

ఈ సినిమాకు వెంకీ కెరీర్ లోనే అత్యధిక బిజినెస్ జరగడం విశేషం. రూ.27 కోట్ల దాకా ప్రి రిలీజ్ చేసి నిర్మాతను సంతోషంలో ముంచెత్తింది బాబు బంగారం. నైజాం ఏరియాలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు బాబు బంగారం సినిమాను రూ.6 కోట్లకు కొనుగోలు చేయడం విశేషం. ఆ ఏరియా వరకు కూడా వెంకీ సోలో హీరోగా చేసిన సినిమాల్లో ఇది రికార్డు. తర్వాత సీడెడ్ ఏరియాకు ఈ సినిమా రూ.4 కోట్లు తెచ్చింది.

ఉత్తరాంధ్రకు రూ.2.8 కోట్లకు.. నెల్లూరుకు రూ.కోటికి.. గుంటూరుకు రూ.2.4 కోట్లకు.. కృష్ణా జిల్లాకు రూ.2.25 కోట్లకు.. పశ్చిమగోదావరికి రూ.1.75 కోట్లకు.. తూర్పుగోదావరికి రూ.2.25 కోట్లకు హక్కులు అమ్మారు. ఓవర్సీస్ లో ఈ సినిమాను బ్లూ స్కై సినిమాస్ విడుదల చేస్తోంది. అక్కడి రైట్స్ కూడా రూ.2.25 కోట్లు పలకడం విశేషమే. కర్ణాటక హక్కులు రూ.2.2 కోట్లకు అమ్ముడయ్యాయి. మొత్తానికి మారుతితో జత కట్టి వెంకీ మంచి నిర్ణయమే తీసుకున్నాడన్నమాట.