జీఎస్టీ సవరణలకు లోకసభ ఓకే

చరిత్రాత్మక పన్ను సంస్కరణగా భావిస్తున్న జీఎస్టీ సవరణ బిల్లును లోక్ సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. గతేడాది జీఎస్టీ బిల్లును లోక్ సభ ఆమోదించినప్పటికీ.. రాజ్యసభలో గతవారం నాలుగు సవరణలతో బిల్లు పాస్ అయింది. తాజాగా లోక సభ కూడా ఆమోదించడంతో…. జీఎస్టీ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం లభించినట్టయింది. జీఎస్టీ రాజ్యాంగ 122వ సవరణ బిల్లుపై స్పీకర్ ఓటింగ్ నిర్వహించారు. 443 అనుకూల ఓట్లతో ఏకగ్రీవంగా జీఎస్టీ బిల్లులోని సవరణలను సభ ఆమోదించింది.

సవరించిన బిల్లును మధ్యాహ్నం లోక్ సభలో ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ. చర్చను ప్రారంభించిన జైట్లీ… జీఎస్టీ బిల్లుకు అన్ని పార్టీల మద్దతుందని చెప్పారు. అన్ని రాష్ట్రాలు, పార్టీల అభిప్రాయాలు తీసుకుని… బిల్లులో వాటిని పొందుపరిచామన్నారు. టాక్సేషన్ రేట్లను జీఎస్టీ కౌన్సిల్ డిసైడ్ చేస్తుందన్నారు.లోక్ సభలో జీఎస్టీ సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా పార్టీలు తమ అభిప్రాయాలు చెప్పాయి.

జీఎస్టీ బిల్లుపై చర్చకు ప్రధానమంత్రి మోడీ ముగింపునిచ్చారు. జీఎస్టీ బిల్లు.. ఏ ఒక్క పార్టీ ఘనత కాదనీ.. అందరూ కలిస్తేనే ఇది సాధ్యమైందన్నారు. పన్ను సంస్కరణల్లో మార్పు, పారదర్శకత దిశగా గొప్ప అడుగు పడిందన్నారు.  జీఎస్టీ బిల్లుపై చర్చ సందర్భంగా ఏఐఏడీఎంకే సభ నుంచి వాకౌట్ చేసింది. కాంగ్రెస్ సహా… అన్ని పార్టీల సహకారంతో… జీఎస్టీ పార్లమెంట్ ఆమోదం పొందింది. యాభైశాతం రాష్ట్రాల అసెంబ్లీల ఆమోదం తర్వాత.. వచ్చే ఏడాది ఏప్రిల్ 1నుంచి జీఎస్టీ చట్టం అమలులోకి రానుంది.