చంద్రబాబుకి షాకిచ్చిన నరేంద్రమోడీ

కేంద్ర మంత్రివర్గ విస్తరణలో తెలుగుదేశం పార్టీకి ఇంకో అవకాశం ఇవ్వకపోవడం ద్వారా ప్రధాన మంత్రి నరేంద్రమోడీ చంద్రబాబుకి పెద్ద ఝలక్‌ ఇచ్చారని చర్చించుకుంటున్నారు రాజకీయ వర్గాలలో. టిడిపి నాయకులు కూడా నరేంద్రమోడీ తీరు పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారట. ఇప్పుడున్న రెండు కేంద్ర మంత్రి పదవులతోపాటు కొత్తగా మరో పదవిని టిడిపి ఆశించింది. ఒకరు క్యాబినెట్‌ మంత్రి, ఒకరు సహాయ మంత్రిగా టిడిపి నుంచి కేంద్రంలో ఉన్నారు. వారిని అలాగే ఉంచి, కొత్త ఛాన్స్‌ ఇవ్వాలని చంద్రబాబు కూడా ప్రధాని నరేంద్రమోడీని కోరారు. అయితే దానికి నరేంద్రమోడీ సుముఖత వ్యక్తం చేయలేదట. చూద్దాం, చేద్దామని చెప్పి నరేంద్రమోడీ నిండా ముంచేయడం పట్ల చంద్రబాబు కూడా చిన్నబుచ్చుకున్నారని సమాచారమ్‌.

టిడిపి నాయకులు కేంద్రాన్ని, బిజెపిని విమర్శిస్తుండడం అనైతికమని, మిత్రధర్మం కాదని బిజెపి కేంద్ర నాయకత్వం చంద్రబాబుతో ఇదివరకే చెప్పింది. ఆ గ్యాప్‌ వల్లనే చంద్రబాబు కేంద్రం నుంచి ఇంకో పదవి తెచ్చుకోలేకపోయారని కూడా అనుకుంటున్నారు. ఉన్న మంత్రుల వల్లనే ఆంధ్రప్రదేశ్‌కి న్యాయం జరగనప్పుడు కొత్తగా ఎవరికైనా కేంద్రంలో అవకాశం వచ్చినా ఏం లాభం? అని విమర్శిస్తూనే, కేంద్రం వద్ద చంద్రబాబు పరువు పోయిందని నేటి కేంద్ర మంత్రి వర్గ విస్తరణ తర్వాత వెటకారం చేస్తున్నాయి విపక్షాలు.