ఎపిలో బి.కాం కంప్యూటర్స్ క్లోజ్!

బికాం కంప్యూటర్ అప్లికేషన్స్ కోర్సుకు మంగళం పాడేయడానికి ఎపి స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయర్ ఎడ్యుకేషన్ ప్రణాళిక సిద్దం చేసింది. ఉన్నత విద్యావిధానంలో మార్పుల కోసం చేస్తున్న ప్రయత్నాల్లో ఇతర కోర్సులపై ప్రభావం ఎలా వున్నా బి.కాం కంప్యూటర్స్ మాత్రం షేపులు మారిపోతున్నాయి. అసలు ఆ కోర్సు పేరే ఇకపై వినబడడం కష్టమేననిపిస్తుంది. కంప్యూటర్ ప్రభంజనంతో అకౌంటెన్సీలో పట్టు సాధించడం కోసం డిగ్రీలో బి.కాం చదివే విద్యార్థులకు కంప్యూటర్ అకౌన్సీమీద పట్టుండాలన్న లక్ష్యంతో ప్రవేశ పెట్టిన కోర్సు ఇక కనుమరుగు కానుంది?. ఎపిఎస్ సి హెచ్ అధికారులు కూడా ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నారు. అయితే కోర్సును రద్దు చేయడం లేదని, రీ స్ర్టక్చర్ చేస్తున్నామని చెబుతున్నారు.

1998వ సంవత్సరంలో బి. కాం కంప్యూటర్స్ కోర్సును ఎపిలో ప్రవేశ పెట్టారు. బి.కాం కు పెరుగుతున్న ఆదరణ, బిఎ,బిఎస్సీకి ఉన్న సౌలభ్యం ఈ కోర్సులో చేరే అభ్యర్థులకు లేకపోవడం, అకౌంటింగ్ లో కంప్యూటర్ పరిజ్ఘానం అవసరమని భావించి అప్పట్లో ఎపి ఎస్ సి హెచ్ఇ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో కోర్సుకు కూడా ఆదరణ పెరిగింది. బి.కాం జనరల్ కోర్సులో చేరేవారికన్నా కంప్యూటర్ అప్లికేషన్లో చేరే వారి సంఖ్య 60శాతం ఎక్కవైంది. దీంతో పాటు బి.కాంలో అడ్వర్టైజ్ మెంట్ అండ్ సేల్స్ మెన్ షిప్, టాక్సేషన్, ఆఫీస్ మేనేజ్ మెంట్, ఎంటర్ ప్రిన్యుయర్ షిప్ కోర్సులు కూడా ప్రవేశ పెట్టారు. వీటన్నింటికీ అంతంత మాత్రమే ఆదరణ వున్నా బి.కాం కంప్యూటర్ అప్లికేషన్ కు విశేష ఆదరణ లభించింది. కొన్ని ప్రైవేటు కళాశాలల్లో అయితే బి.కాం జనరల్ కోర్సును నిలిపేసి కేవలం కంప్యూటర్ అప్లికేషన్స్ కోర్సును మాత్రమే నడుపుతున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతమున్న 13 జిల్లాల్లో 14వందల కళాశాలల్లోనూ బి.కాం వుంది. కేవలం 15శాతం కన్నా తక్కువ మాత్రం జనరల్ కోర్సులో వున్నారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, టిటిడి, ఎయిడెడ్, అన్ ఎయిడెడ్ కళాశాలల్లో ఈ కోర్సు వుంది. బిఎ, బిఎస్సీ చేరని వారు బికాంలో మొదటి ప్రాధాన్యత కంప్యూటర్ అప్లికేషన్స్ కే ఇస్తున్నారు. అక్కడ సీటు రాక ప్రభుత్వ కళాశాలలో తప్ప మరో చోట చదివే స్థోమత లేని వారు మాత్రమే బి.కాం జనరల్ కు వెళ్తున్న పరిస్థితి. అయితే కోర్సు రీ స్ర్టక్చర్లో భాగంగా ఛాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ కు అనుగుణంగా రూపొందించే క్రమంలో ఈ కోర్సుకు మంగళం పాడుతున్నారు. బికాం లోనే చివరి యేడాది రెండు సెమిస్టర్లలో కంప్యూటర్ అప్లికేషన్స్ పెట్టి కోర్సును రూపొందించాలని చూస్తున్నారు. అక్కడే వారికి ఆప్షన్స్ పెట్టి టాక్సేషన్, సేల్స్ మెన్ షిప్, అడ్వర్టైజ్ మెంట్, ఆఫీస్ మేనేజ్ మెంట్, ఎంటర్ ప్రిన్యుయర్ షిప్ ను ప్రవేశపెట్టాలని యోచిస్తున్నారు.

డిజిటల్ ఇండియా నిర్మాణం జరుగుతున్న తరుణంలో బికాం కోర్సులో మొదటి రెండేళ్ళు కామన్ సిలబస్ చదివి మూడవ సంవత్సరంలో ఆప్షనల్స్ ఎంపిక చేసుకునే ప్రక్రియ ప్రాక్టికల్ గా సాధ్యమేనా అన్నది ప్రశ్నార్థకంగా మారుతోంది. జాబ్ ఓరియంటేషన్ అధికంగా వున్న కోర్సును అనవసరంగా మార్చుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ర్టంలోని ప్రైవేట్ డిగ్రీకళాశాలల అసోసియేషన్ ఈమేరకు ఎపి స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఉన్నతాధికారులకు వినతిపత్రం కూడా సమర్పించారు.

బి.కాం కోర్సులో మార్పులన్నీ సిబిసియస్ కు అనుగుణంగా మార్పు చేస్తున్నామంటున్నారు ఎపి ఎస్ సి హెచ్ ఇ వైస్ ఛైర్మన్ ప్రొఫెసర్ నరసింహరావు. మార్పులకు అనుగుణంగా కోర్సును స్ర్టక్చర్లో చేంజ్ చేస్తున్నామంటున్నారు. మూడవ సంవత్సరంలో విద్యార్థికి అవసరమైన ఆప్షన్ ఎంచుకునే వెసులుబాటు కల్పిస్తున్నామన్నారు. ఎప్పుడో ప్రవేశ పెట్టిన ఈ కోర్సులో డిగ్రీ స్థాయిలో కంప్యూటర్ ఫండమెంటల్స్ నేర్చుకునే పరిస్థితి వుండదంటున్నారు. అన్ని విధాలా చర్చించి బోర్డ్ ఆఫ్ స్టడీస్ సభ్యుల సూచనలు, సలహాలు స్వీకరించి మార్పుల కోసం ప్రయత్నం చేస్తున్నామని అంటున్నారు.

బిఎలో పలు కాంబినేషన్స్ లో కోర్సులున్నాయి, బిఎస్సీలోనూ వున్నాయి, అయితే మార్పులు బి.కాంలోనే ఎందుకు చేయాల్సి వస్తోందని అంటున్నారు కామర్స్ అధ్యాపకులు, ప్రైవేటు కళాశాల కరెస్పాండెంట్ లు, విద్యార్థులు. ఉపాధి ఎక్కువగా వున్న కోర్సును కాస్త మార్చి గందరగోళం సృష్టించొద్దంటున్నారు. బి.కాం కంప్యూటర్స్ కోర్సు పూర్తి చేసిన వారికి సాఫ్ట్ వేర్ కంపెనీలు, అకౌంటింగ్ సంస్థలో విరివిగా ఉద్యోగాలు దొరుకుతున్నాయన్నారు. సిబిసియస్ పాటర్న్ కు అనుగుణంగా ప్రస్తుతమున్న కోర్సులో సిలబస్ మార్చితే సరిపోతుందంటున్నారు. ప్రైవేట్ కళాశాల అధ్యాపకుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకపోవడం వల్లే అనాలోచిత మార్పులు చేయడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. అత్యంత ఆదరణ, ఉద్యోగ అవకాశాలు వున్న బి.కాం కంప్యూటర్ అప్లికేషన్ కోర్సును కొనసాగించాలని అంటున్నారు.