నాగబాబు సంచలన నిర్ణయం.. సినిమాలకు త్వరలో గుడ్‌బై!!

మెగా బ్రదర్ నాగబాబు సినిమా పరిశ్రమకు ఎంతో కాలం పాటు సేవలను అందించాడు. నటుడిగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా ఎన్నో మంచి సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందజేశాడు. ఇటీవల కాలం వరకు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటిస్తూ అలరించిన మెగా బ్రదర్ ఇప్పుడు ఒక షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. అదే అతను సినిమాల నుంచి తప్పుకోవాలని. గతంలో కూడా ఇలాంటి వార్తలు వచ్చాయి కానీ అతను ఎందుకో మళ్లీ సినిమాల్లో కొనసాగాడు. ఇప్పుడు మాత్రం నిజంగానే అతను సినిమాలకి స్వస్తి పలకాలని యోచిస్తున్నట్లు సినీ సర్కిల్లో వినిపిస్తున్న మాట.

దీనికి కారణం అతను తన తమ్ముడు జనసేన పార్టీ కోసం పూర్తిస్థాయిలో ప్రచారం చేయాలని నిర్ణయించుకోవడమేనని తెలుస్తోంది. తనవంతుగా పార్టీని జనాల్లోకి తీసుకువెళ్లాలని ఉద్దేశంతో అతను గత కొన్ని నెలలుగా ఎలాంటి సినిమా ఆఫర్లను అంగీకరించడం లేదు. ఆంధ్రప్రదేశ్‌లో మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి. ఈ నేపథ్యంలో తమ్ముడికి అండదండగా ఉండాలని నాగబాబు నిర్ణయించుకున్నట్లు సమాచారం.

అయితే ఎన్నికలు అయిపోయిన తర్వాత నాగబాబు ఖాళీగా ఉండే అవకాశం ఉంటుంది. ఆ సమయంలోనైనా సినిమాలలో నటించడం ప్రారంభిస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇకపోతే త్వరలోనే నాగబాబు ఇంట పెళ్లి వేడుకలు జరగనున్నాయి. వరుణ్ తేజ్, లావణ్య త్వరలోనే పెళ్లి చేసుకోనున్నారు. మరోవైపు నిహారిక విడాకులు తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. మొత్తం మీద నాగబాబు ఫ్యామిలీలో ఇటీవల కాలంలో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి.