అటు నలుగురు..ఇటు నలుగురు..టీడీపీ లెవెల్ చేసిందా!

మొత్తానికి తమ పార్టీ నుంచి జంప్ అయిపోయిన నలుగురు ఎమ్మెల్యేలకు కౌంటరుగా వైసీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలని టి‌డి‌పి లాగిందనే చెప్పాలి. గత ఎన్నికల్లో వైసీపీ గెలిచి అధికారంలోకి వచ్చాక టి‌డి‌పి నుంచి గెలిచిన 23 మంది ఎమ్మెల్యేల్లో కొందరు..వైసీపీ అధికార బలానికి తల వంచక తప్పలేదు. ఈ క్రమంలో వరుసపెట్టి నలుగురు టి‌డి‌పి ఎమ్మెల్యేలు వైసీపీ వైపుకు వెళ్లారు. దీంతో టి‌డి‌పి బలం 19కు చేరుకుంది.

అయితే 19 లో కూడా ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని వారు కూడా వచ్చేస్తారని చంద్రబాబుకు ప్రతిపక్షం లేకుండా చేస్తామని వైసీపీ నేతలు చెబుతూ వచ్చిన విషయం తెలిసిందే. కానీ అలా చేయడంలో వైసీపీ విఫలమైంది..ఆ నలుగురు కాకుండా మరో ఎమ్మెల్యే వైసీపీ వైపు వెళ్లలేదు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అవుతుంది. ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉండగానే అధికార పార్టీని కాదని వైసీపీ ఎమ్మెల్యేలు టి‌డి‌పి వైపుకు రావడం గమనార్హం.

ఇప్పటికే ఆనం రామ్ నారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీకి దూరమయ్యారు. ఇదే క్రమంలో తాజాగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ ఇద్దరు రెబల్ ఎమ్మెల్యేలతో పాటు మరో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు టి‌డి‌పికి క్రాస్ ఓటింగ్ వేశారు. దీంతో టి‌డి‌పి విజయం ఖాయమైంది. టి‌డి‌పి నుంచి వచ్చిన నలుగురు ఎమ్మెల్యేలు, జనసేన ఒక ఎమ్మెల్యేని కలుపుకుని తమకు 7 గురుని గెలుచుకునే సంఖ్యా బలం ఉందని చెప్పి వైసీపీ 7 గురు అభ్యర్ధుల్ని నిలిపింది.

కానీ అనూహ్యంగా వైసీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేయడంతో..టి‌డి‌పి అభ్యర్ధి పంచుమర్తి అనురాధ గెలిచారు. అంటే దీంతో లెవెల్ అయిపోయిందనే చెప్పాలి. అంటే టి‌డి‌పి నుంచి నలుగురు వైసీపీలోకి వెళితే..వైసీపీ నుంచి నలుగురు టి‌డి‌పి వైపుకు వచ్చారు.