అఖండపైనే ఆశలు పెట్టుకున్న పుష్ప, ఆర్ఆర్ఆర్..!

ఏపీ ప్రభుత్వం ఇటీవల అసెంబ్లీలో సినిమాటోగ్రఫీ చట్ట సవరణ బిల్లును ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం థియేటర్లలో రోజుకు 4 షోలు మాత్రమే వేయాలి. బెనిఫిట్ షోలు వేయడానికి ఉండదు. సినిమా విడుదలైన కొత్తలో నిర్మాతలు టికెట్ రేట్లు పెంచి ఇప్పటివరకు విక్రయిస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు అలాంటి అవకాశం ఉండదు. సినిమా టికెట్లను కూడా ప్రభుత్వమే విక్రయించనుంది. ఇందుకోసం ఆన్ లైన్ టికెటింగ్ విధానాన్ని అతిత్వరలో అమలులోకి తీసుకురానుంది. ప్రభుత్వం తీసుకొచ్చిన చట్ట సవరణ బిల్లు పట్ల తెలుగు సినీ ఇండస్ట్రీలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలు తక్కువ ధర టికెట్ల వల్ల, బెనిఫిట్ షోలు లేకపోవడం వల్ల భారీగా నష్టపోయే అవకాశం ఉంది. నిజం చెప్పాలంటే ఇప్పుడు వాళ్ళ పరిస్థితి జూదంగా మారింది. ఇప్పటికే పలు సినిమాలను పాన్ ఇండియా స్థాయిలో నిర్మించి విడుదలకు సిద్ధంగా ఉంచారు. ఇప్పుడున్న టికెట్ల ధరలతో సినిమాలను విడుదల చేస్తే.. ఆయా సినిమాల నిర్మాతలు భారీగా నష్టపోవాల్సి ఉంటుంది. దీంతో నిర్మాతలు దిక్కుతోచని స్థితికి చేరుకున్నారు.

కరోనా కారణంగా పలు భారీ బడ్జెట్ సినిమాలు విడుదలకు నోచుకోలేదు. ఇప్పుడు పరిస్థితిలో మార్పు రావడంతో డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు వరుసగా భారీ సినిమాలు విడుదలవుతున్నాయి. వీటిలో అన్నింటికంటే ముందు బాలకృష్ణ-బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న అఖండ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా డిసెంబర్ 2వ తేదీన విడుదల అవుతుండగా.. 17వ తేదీన అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప విడుదల కానుంది. ఇక జనవరి 7వ తేదీన సంక్రాంతి సందర్భంగా రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, చరణ్ హీరోలుగా నటించిన అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ విడుదల కానుంది.

ఇక సంక్రాంతి సందర్భంగా 12వ తేదీన పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్, 14న ప్రభాస్ హీరోగా నటిస్తున్న మరో పాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్ విడుదల కానుంది. మెగాస్టార్ చిరంజీవి -కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న ఆచార్య సినిమా ఫిబ్రవరి 4వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమాలన్నీ భారీ బడ్జెట్ తో తెరకెక్కినవే. ఈ సినిమాల్లో అన్నింటి కంటే ముందే అఖండ విడుదల అవుతుండటంతో సినీ ఇండస్ట్రీ చూపంతా ఆ సినిమాపైనే పడింది. ఏపీలో టికెట్ రేట్లు తగ్గడం వల్ల, బెనిఫిట్ షోలు కోల్పోవడం వల్ల ఆ సినిమా ఎంత స్థాయిలో వసూలు సాధిస్తుందో చూడాలని నిర్మాతలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఏపీలో టిక్కెట్ల ధరలు తగ్గడంతో ఇప్పటికే అఖండ సినిమా థియేట్రికల్ రైట్స్ కొన్న డిస్ట్రిబ్యూటర్లు.. ముందు ఒప్పుకున్న మొత్తాన్ని కంటే 20 శాతం తక్కువగా నిర్మాతకు చెల్లిస్తున్నారు. అఖండ విడుదలై భారీగా వసూళ్లు రాబడితే.. మిగిలిన భారీ చిత్రాల థియేట్రికల్ రైట్స్ ముందు చెప్పినట్టుగానే నిర్మాతలకు అమ్ముతారు. ఒకవేళ అఖండ మూవీ అనుకున్నంత స్థాయిలో వసూళ్లు రాబట్టకపోతే మాత్రం ఇప్పటికే థియేట్రికల్ బిజినెస్ పూర్తి చేసుకున్న మిగిలిన భారీ సినిమాలు కూడా డిస్ట్రిబ్యూటర్లకు తక్కువ మొత్తానికి రైట్స్ విక్రయించాల్సి ఉంటుంది.

కాగా పుష్ప, ఆర్ఆర్ఆర్ నిర్మాతలు ఇప్పటికే థియేట్రికల్ రైట్స్ తగ్గిస్తామని డిస్ట్రిబ్యూటర్లతో ఒప్పందం కూడా చేసుకున్నారు. ఏదేమైనా భారీ సినిమాల్లో ముందుగా విడుదలవుతున్న అఖండ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్లు ఏ మేరకు సాధిస్తుందా అని ఇండస్ట్రీ మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తోంది.