కృతి శెట్టి.. పరిచయం అవసరం లేని పేరు. సుకుమార్ ప్రియ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వంలో మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా తెరకెక్కిన `ఉప్పెన` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది కృతి శెట్టి. ఈ సినిమా రిలీజ్ అవ్వకముందే తన క్యూట్ అందాలతో సెన్సేషన్ క్రియేట్ చేసిన కృతి.. ఉప్పెన విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ట అయ్యాక కుర్రకారు కలల రాకుమారిగా మారిపోయిందీ బ్యూటీ.
ఈ నేపథ్యంలోనే సౌత్‌లో చాలామంది దర్శకనిర్మాతలు కృతి డేట్స్ కోసం తెగ ఆరాటపడుతున్నారు. ఇక ప్రస్తుతం ఈ అందాల భామ రెండో చిత్రం `శ్యామ్ సింగ్ రాయ్` విడుదలకు సిద్ధం అవుతోంది. నాని హీరోగా రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ మూవీ డిసెంబర్ 24న విడుదల కానుంది. అలాగే కృతి శెట్టి సుదీర్ బాబు సరసన `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి`, నాగ చైతన్య సరసన `బంగార్రాజు`, రామ్ సరసన ఓ చిత్రం చేస్తోంది.
ప్రస్తుతం ఈ చిత్రాలన్నీ సెట్స్ మీదే ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు స్టార్ హీరోల సినిమాలను ఒప్పుకుంటూ వస్తున్న కృతి.. ఈ సారి రూటు మార్చుకుని ఓ లేడీ ఓరియెంటెడ్ చిత్రానికి సైన్ చేసిందట. మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుష్మిత కొణిదెల ఈ మధ్య నిర్మాతగా మారి.. జీ స్టూడియోస్ సంస్థతో కలిసి సినిమాలు, వెబ్ సిరీస్‌లు నిర్మిస్తున్న విషయం తెలిసిందే.
అయితే తాజాగా సుష్మిత వద్దకు ఓ లేడీ ఓరియెంటెడ్ కథ రాగా.. అందులో కృతి శెట్టి బాగా సెట్ అవుతుందని ఆమె భావిస్తుందట. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం సుష్మిత కృతి శెట్టితో చర్చలు జరుపుతుందట. దాదాపు ఈ ప్రాజెక్ట్‌లో కృతి ఫైనల్ అయిందని టాక్. మరి ఇది ఎంత వరకు నిజమో తెలియాలంటే అధికారిక ప్రకటన రావాల్సిందే.