అధైర్యపడొద్దు మిత్రమా.. చంద్రబాబుకు ఫోన్ లో రజినీకాంత్ పరామర్శ..!

ఏపీ అసెంబ్లీ లో శుక్రవారం ప్రతిపక్ష నేత చంద్రబాబుపై అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు అసభ్య వ్యాఖ్యలు చేసినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అర్ధాంతరంగా అసెంబ్లీని వీడిన చంద్రబాబు తిరిగి తాను ముఖ్యమంత్రి అయిన తర్వాతనే అసెంబ్లీలో అడుగు పెడతానని శపథం చేశాడు. ఆ తర్వాత ఆయన ప్రెస్ మీట్ పెట్టి వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు తన భార్య భువనేశ్వరిపై అసభ్య వ్యాఖ్యలు చేసినట్లు తెలిపారు.

అనంతరం ఆయన భావోద్వేగానికి గురై వెక్కి వెక్కి ఏడ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ ఘటన దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం గా మారింది. ఈ ఘటనపై తెలంగాణకు చెందిన నాయకులు కూడా స్పందించారు. ఇక ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు వైసీపీ నాయకుల తీరుపట్ల నిరసన వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ఇవాళ ఉదయం చంద్రబాబు కు ఫోన్ చేశారు. శుక్రవారం అసెంబ్లీలో జరిగిన ఘటనపై ఆరా తీశారు.
ఈ విషయం తెలుసుకొని ఆయన విచారం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అలాగే చంద్రబాబుకు ధైర్యం చెప్పారు. ఏపీలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల గురించి కూడా రజనీ అడిగి తెలుసుకున్నారని సమాచారం.

అసెంబ్లీలో జరిగిన ఘటన పై నందమూరి కుటుంబ సభ్యులు అందరూ స్పందించిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ కుమారులైన బాలకృష్ణ, రామకృష్ణ తదితరులతోపాటు పురందేశ్వరి, జూనియర్ ఎన్టీఆర్, నారా రోహిత్ తదితరులు నందమూరి కుటుంబం జోలికి రావద్దు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా మరోవైపు వైసీపీ నేతలు చంద్రబాబు కుటుంబం పట్ల తాము అసభ్యంగా ప్రవర్తించలేదని, చంద్రబాబు మరోసారి డ్రామా ఆడుతున్నాడని విమర్శలు చేస్తున్నారు.

Share post:

Latest