టీడీపీ ఎమ్మెల్యేకు కూలి ప‌ని ఆఫ‌ర్‌

ఆశ్చ‌ర్యంగా అనిపిస్తోందా?! ఇది నిజ‌మే!! జ‌నం ఇప్పుడు చైత‌న్య వంతుల‌య్యార‌న‌డానికి ఈ కామెంట్లే బెస్ట్ ఎగ్జాంపుల్‌. విష‌యంలోకి వెళ్లిపోతే.. ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలోని భీమ‌వ‌రంలో నిర్మిస్తున్న ఆక్వాఫుడ్ పార్క్ విష‌యంలో అక్క‌డి రైతులు, రైతు కుటుంబాలు పెద్ద ఎత్తున ఉద్య‌మిస్తున్న విష‌యం తెలిసిందే. అయితే, ప్ర‌భుత్వం మాత్రం మొండిగా పోలీసుల‌ను కాప‌లా పెట్టి మ‌రీ ప‌ని కానిచ్చేస్తోంది. ఈ క్ర‌మంలో ఓ ఛాన‌ల్ సిబ్బంది అక్క‌డి ప‌రిస్థితులు తెలుసుకునేందుకు నేరుగా రంగంలోకి దిగారు. బాధిత కుటుంబాల్లోని మ‌హిళ‌లతో ముచ్చ‌డించారు.

ఈ సంద‌ర్భంగా ఓ మ‌హిళ మాట్లాడుతూ.. త‌మ క‌ష్టాలు తీరుస్తాడ‌ని, త‌మ ప‌నులు చేసి పెడ‌తాడ‌ని తాము అంజిబాబు(భీమ‌వ‌రం టీడీపీ ఎమ్మెల్యే పుల‌ప‌ర్తి రామాంజ‌నేయులు)ను ఎన్నుకున్న‌ట్టు తెలిపింది. ఖాళీగా ఉన్న అంజిబాబుకు ఓట్లేసి గెలిపించి ప‌నిక‌ల్పించామ‌ని ఆ మ‌హిళ చెప్ప‌డం ఒకింత ఆశ్చ‌ర్యానికి గురిచేసింది. అంతేకాదు.. తాము ఎంతో వ్య‌తిరేకిస్తున్న ఆక్వా పార్కును అంజిబాబే క‌ట్టిస్తున్నాడ‌ని, ఎందుక‌ని ప్ర‌శ్నిస్తే.. మీకు ప‌నులు క‌ల్పించేందుకేన‌ని చెబుతున్నాడ‌ని ఆ మ‌హిళ తెలిపింది.

అస‌లు మాకెందుకు ప‌నులు. మా పిల్ల‌లు బాగానే సెటిల్ అయ్యారు క‌దా అని ఆ మ‌హిళ ఎద‌రు ప్ర‌శ్నించ‌డంతోపాటు.. మేమే నీకు(అంజిబాబు) ప‌నిలేద‌ని జాలిప‌డి ప‌నిస్తే(ఎమ్మెల్యేని చేయ‌డం) నువ్వు మాకే ప‌నిక‌ల్పిస్తాన‌ని చెబుతావా? అంటూ ఓ రేంజ్‌లో మీడియా గొట్టం సాక్షిగా విరుచుకుప‌డింది. త‌మ‌కేమీ అంజిబాబు ప‌నులు చూపించ‌క్క‌ర్లేద‌ని, అవ‌స‌ర‌మైతే.. ఈ ఐదేళ్లు పూర్త‌య్యాక మ‌ళ్లీ ప‌నిచూపించ‌మ‌ని అడిగితే.. తామే ఏదో ఒక ప‌ని అంజికి చూపిస్తామ‌ని ఆ మ‌హిళ అన‌డం విశేషం.

మొత్తానికి ఆక్వాపార్క్ విష‌యంలో స్థానిక ఎమ్మెల్యేపై ప్ర‌జ‌లు ఏరేంజ్‌లో రియాక్ట్ అవుతున్నారో చెప్ప‌డానికి ఇదొక ప్ర‌త్య‌క్ష ఉదాహ‌ర‌ణ‌!! మ‌రి.. అంజిబాబు.. ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. ఇంత‌కు అంజిబాబు ఎవ‌రో కాదు మంత్రి గంటా శ్రీనివాస‌రావుకు స్వ‌యానా వియ్యంకుడే.