క‌ల్వ‌కుంట్ల ఫ్యామిలీకి త‌ల‌నొప్పిగా కంట్లో న‌లుసు

తెలంగాణ అధికార పార్టీ టీఆర్ ఎస్ అధినేత‌, సీఎం క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్‌రావు(కేసీఆర్‌) స్టేట్‌లో త‌న‌కు తిరుగులేని శ‌క్తిగా అవ‌త‌రించార‌న‌డంలో సందేహం లేదు. తెలంగాణ ఉద్య‌మం నుంచి మొద‌లు పెట్టి.. ఇప్ప‌టి వ‌ర‌కు అన్ని విష‌యాల్లోనూ ఆయ‌న చేసిన ప్ర‌య‌త్నం ఆయ‌న‌ను సీఎంను చేసింది. దీంతో త‌న కుమారుడు, కుమార్తెను సైతం పాలిటిక్స్‌లోకి దింపేశారు. ఇక‌, స్టేట్‌లో కారు మాత్ర‌మే దూసుకుపోవాల‌ని ప‌క్కా ప్లాన్ వేసిన కేసీఆర్‌.. ఇటు టీడీపీని, అటు వైకాపాను కూడా దాదాపు నామ రూపాలు లేకుండా చేశారు. కాంగ్రెస్ ప‌రిస్థితి ఉన్నా కూడా లేన‌ట్టే అన్న‌ట్టుగా ఉంది!.

ధీంతో కేసీఆర్ రాబోయే ముప్పై ఏళ్ల‌పాటు తాను, త‌న ప‌రివారం క‌లిసి తెలంగాణ‌ను పాలించాల‌ని భావించారు. అయితే, ఇప్పుడు జేఏసీ చైర్మ‌న్, ప్రొఫెస‌ర్ కోదండ రామ్‌.. కేసీఆర్‌కి నిద్ర ప‌ట్ట‌నివ్వ‌డం లేదు. దాదాపుగా ప్ర‌త్య‌ర్ధి ప‌క్షాలను ఏరిపారేశాన‌ని భావిస్తున్న త‌రుణంలో కేసీఆర్‌కి కంట్లో న‌లుసులా మారార‌ట‌! ఆరు నెల‌ల నుంచి కోదండ రాం సీఎం కేసీఆర్‌.. ఆయ‌న పాలన‌పై నిశిత విమ‌ర్శ‌లు చేస్తున్నారు. వాస్త‌వానికి వేరే పార్టీ వాళ్లెవ‌రైనా చేస్తే.. తెలంగాణ ద్రోహులు అలా మాట్లాడార‌ని కేసీఆర్ అండ్ కో ఎదురు దాడి చేసేది.

కానీ, కోదండ రామ్ .. తెలంగాణ కోసం అహ‌ర‌హం శ్ర‌మించిన వ్య‌క్తి. ప్రజ‌ల్లో మంచి పాపులారిటీ ఉన్న మేధావి. దీంతో ఆయ‌న చేసే విమ‌ర్శ‌ల‌పై పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. అంతేకాదు, త్వ‌ర‌లోనే తాను ఓ మీడియా సంస్థ‌ను ఏర్పాటు చేస్తున్నాన‌ని కూడా కోదండ రామ్ ప్ర‌క‌టించారు. దీంతో ఆయ‌న పొలిటిక‌ల్ ఎంట్రీ దాదాపు ఖ‌రారైపోయింద‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. ఇది త‌మ‌కు ఎఫెక్ట్ అవుతుంద‌ని భావించిన కేసీఆర్‌.. గ‌తంలో కోదండ రామ్‌తో ఉన్నఅనుబంధాన్ని ప‌క్క‌కు పెట్టి.. ఎదురు దాడి చేయిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే మంత్రి కేటీఆర్ .. సిగ్గు.. ఎగ్గు అంటూ కోదండంపై విరుచుకుప‌డ్డారు.

టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డితో కోదండం వేదిక‌ను పంచుకోవ‌డంపై కేటీఆర్ ఫైర‌య్యారు. చిప్ప‌కూడు తిన్న‌వాళ్ల ప‌క్క‌న కూర్చోడానికి సిగ్గులేదా? అని ప్ర‌శ్నించారు. ఈప‌రిణామం అంతా గ‌మ‌నిస్తున్న విశ్లేష‌కులు మాత్రం కోదండ రామ్‌.. క‌ల్వ‌కుంట్ల ఫ్యామిలీకి కంట్లో న‌లుసుగా మారాడ‌ని అందుకే ఈ ఎదురుదాడి ఈ స్టైల్‌లో చేస్తున్నార‌ని అంటున్నారు. మ‌రి ఇదే నిజ‌మైతై.. కేసీఆర్‌కి బ‌ల‌మైన ప్ర‌త్య‌ర్థి ఎదురైన‌ట్టుగానే భావించాలి.